మీ బ్యాటు ’మందం’.. పక్కనపెట్టండి.. ఐపీఎల్ లో తలపోటు రూల్
టి20 క్రికెట్ అంటేనే ధనాధన్.. బంతిపై బ్యాట్ దే పెత్తనం.. ఎంత మంచి బౌలర్ అయినా బలి కావాల్సిందే.. ఇక గత సీజన్ వరకు బ్యాట్ ఎలాంటిదైనా పట్టింపు లేకపోయేది
By: Tupaki Desk | 27 April 2025 12:00 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. కొత్త కొత్త నిబంధనలు.. చాంపియన్ల భంగపాటు.. కుర్రాళ్ల మెరుపులు.. ఇవే కాదు.. మరొక్క నిబంధన కూడా..
టి20 క్రికెట్ అంటేనే ధనాధన్.. బంతిపై బ్యాట్ దే పెత్తనం.. ఎంత మంచి బౌలర్ అయినా బలి కావాల్సిందే.. ఇక గత సీజన్ వరకు బ్యాట్ ఎలాంటిదైనా పట్టింపు లేకపోయేది. అంటే మందం వంటి అంశాల్లో.. ఈసారి లీగ్ లో మాత్రం బ్యాటర్లందరినీ ఇబ్బంది పెడుతోంది ఇదే అంశం.
వాస్తవానికి కొంతకాలంగా ఐపీఎల్ లో బ్యాట్స్ మెన్ వాడే బ్యాట్ల విషయంలో ఫిర్యాదులు ఉన్నాయి. ఆటగాళ్లు ద్రఢమైన మందపాటి అంచు ఉన్న గట్టి బ్యాట్ లను వాడుతున్నారని ప్రాథమిక ఆరోపణ.
దీంతో బ్యాట్స్ మెన్ కు మంచి ఎడ్జ్ వస్తోంది. ఇది హిట్టింగ్ రేంజ్ ను పెంచుకోవడానికి పనికొస్తోంది. ఇలాంటి స్థితిలో సరైన స్థానంలో బంతి తగిలితే అది సిక్స్, ఫోర్ పోతుంది. అసలే ఐపీఎల్ లో బ్యాట్స్ మెన్ రాజ్యం అనే విమర్శ ఉంది. మందపాటి బ్యాట్లు.. మరింత ప్రయోజనం కలిగిస్తున్నాయి.
ఈ సీజన్ నుంచి ఐపీఎల్ పాలక మండలి కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. బ్యాట్ కొలతలు వేసి మరీ చూస్తోంది. ఇది ఓపెనర్ అయినా.. టెయిల్ ఎండ్ బ్యాటర్ అయినా అందరికీ వర్తింపజేస్తోంది. నిర్ణీత స్కేల్ దాటితే నిర్మొహమాటంగా తిరస్కరిస్తోంది.
ఈ సీజన్ లో నిబంధనను ప్రవేశపెట్టినప్పుడు మ్యాచ్ లో రెండుసార్లు మాత్రమే తనిఖీ అన్నారు. ఓపెనర్లు, కొంతమంది ఆటగాళ్ల బ్యాట్ ల తనిఖీకి మాత్రమే అని పేర్కొన్నారు.
కానీ, లీగ్ సాగుతున్నకొద్దీ అందరు బ్యాటర్ల బ్యాట్ లను తనిఖీ చేస్తున్నారు. ఓ రకంగా ఇది అంపైర్లకు కూడా తలనొప్పిగా మారింది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లోనూ బ్యాట్ మందాన్ని పరీక్షించి నిర్ణీత ప్రకారం లేకుంటే మార్పించారు. బ్యాట్ కు పరిమితులు విధించడం అంటే.. బ్యాటింగ్-బౌలింగ్ మధ్య సమతుల్యత కోసమేనని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి.