Begin typing your search above and press return to search.

బుమ్రా? గిల్? 5 టెస్టుల ఇంగ్లండ్ టూర్.. టీమ్ ఇండియా ను నడిపేదెవరు?

టెస్టు క్రికెట్ లో విదేశీ సిరీస్ లు అంటే కఠినమే.. మూడు టెస్టుల సిరీస్ అయితే సరే.. ఐదు టెస్టులు అంటే మాత్రం శారీరకంగా, మానసికంగా ఎంతో సంసిద్ధంగా ఉండాలి.

By:  Tupaki Desk   |   16 May 2025 4:00 PM IST
బుమ్రా? గిల్? 5 టెస్టుల ఇంగ్లండ్ టూర్.. టీమ్ ఇండియా ను నడిపేదెవరు?
X

టెస్టు క్రికెట్ లో విదేశీ సిరీస్ లు అంటే కఠినమే.. మూడు టెస్టుల సిరీస్ అయితే సరే.. ఐదు టెస్టులు అంటే మాత్రం శారీరకంగా, మానసికంగా ఎంతో సంసిద్ధంగా ఉండాలి. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్ ఆడి వచ్చిన టీమ్ ఇండియా.. జూన్ నుంచి ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొననుంది.

అంతా బాగుంటే.. ఈపాటికి ఇంగ్లండ్ టూర్ కు ప్రాబబుల్స్ పేర్లు కూడా బయకు వచ్చేవేమో? కెప్టెన్ గా జట్టును నడిపిస్తాడని భావించిన రోహిత్ శర్మ అనూహ్యంగా రిటైర్మెంట్ ఇచ్చాడు. ఈ షాక్ నుంచి కోలుకునేలోపే స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి మరింత పెద్ద షాక్ ఇచ్చాడు. కెప్టెన్ స్థానం భర్తీనే కాదు.. ఇప్పుడు కోహ్లిని రిప్లేస్ చేయడమూ పెద్ద సవాల్ గా మారింది సెలక్టర్లకు.

ఇక రోహిత్ స్థానంలో యువ బ్యాట్స్ మన్ శుబ్ మన్ గిల్ టీమ్ ఇండియాకు కాబోయే కెప్టెన్ అని నిన్నటివరకు కథనాలు వచ్చాయి. అతడికి డిప్యూటీగా సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను కూడా చేర్చాయి. కానీ, మాజీ ఓపెనర్ శ్రీకాంత్ మాత్రం గిల్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అతటి టెస్టు బ్యాటింగ్ యావరేజీ (35)ని కూడా కారణంగా చూపిస్తున్నాడు. విదేశీ టూర్లలో గిల్ తుది జట్టులో కచ్చితంగా ఉంటాడని చెప్పలేని పరిస్థితిని ప్రస్తావిస్తున్నాడు. శ్రీకాంత్.. కెప్టెన్ గా పేసర్ బుమ్రాను ప్రతిపాదిస్తున్నాడు. శ్రీకాంత్ మ త్రమే కాక దిగ్గజం గావస్కర్ కూడా గిల్ కు కెప్టెన్సీని వ్యతిరేకిస్తున్నాడు.

అయితే, బుమ్రాకు గాయాల బెడద ఉంది. వాస్తవానికి ప్రస్తుత టీమ్ ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ అతడే. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకుంటే బుమ్రానే కెప్టెన్సీ చేశాడు. మ్యాచ్ ను గెలిపించాడు కూడా. ఐదో టెస్టుకు వచ్చేసరికి రోహిత్ పై వేటు పడడంతో బుమ్రాకే బాధ్యతలు ఇచ్చారు. కానీ, ఆ టెస్టులో బుమ్రా వెన్నుగాయం తిరగబెట్టడంతో దాదాపు మూడు నెలలు క్రికెట్ కు దూరమయ్యాడు.

అసాధారణ బౌలింగ్ శైలి, బ్యాట్స్ మెన్ కు సవాల్ విసిరే బుమ్రాకు ఎప్పుడూ గాయాల ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తం అవుతుంటోంది. అందుకనే అతడిపై భారం మోపొద్దు అనేది మాజీల మాట.

గిల్ కు ఇంకా స్థిరత్వం రాని నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు మాత్రం బుమ్రానే కెప్టెన్ గా ఉండాలని ఓ వర్గం వాదిస్తోంది. మరో వర్గం మాత్రం బుమ్రాను జాగ్రత్తగా చూసుకోవాలని, గాయంతో అతడు అందుబాటులో లేకుండా పోతే నాయకుడు అందుబాటులో లేని జట్టుగా మారుతుందని పేర్కొంటున్నారు.

ఇంగ్లండ్ తో జూన్ 20న టీమ్ ఇండియా తొలి టెస్టు ఆడనుంది. ఈ నెలాఖరులోగా జట్టును ప్రకటించనున్నారు. కెప్టెన్ ను తొలిసారిగా మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు. మరి అది బుమ్రానా? గిల్ నా?