Begin typing your search above and press return to search.

బుమ్రా బంతులు బుల్లెట్లు.. మిగతా బౌలర్లవి బఠాణీలు.. ఇదేం బౌలింగ్?

బుమ్రా బంతులు ఇంగ్లండ్ బ్యాటర్లకు బుల్లెట్లులాగా కనిపిస్తే మిగతా వారి బంతులు బఠానీల తరహాలో కనిపించాయి.

By:  Tupaki Desk   |   22 Jun 2025 11:16 PM IST
బుమ్రా బంతులు బుల్లెట్లు.. మిగతా బౌలర్లవి బఠాణీలు.. ఇదేం బౌలింగ్?
X

విదేశమైనా.. స్వదేశమైనా.. టెస్టు మ్యాచ్ గెలవాలంటే ప్రత్యర్థి 20 వికెట్లు తీయాలి.. ఇది అందరు కెప్టెన్లు చెప్పే మాట.. తాము 20 వికెట్లు తీస్తామని తాజాగా టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్ కూడా అన్నాడు. కానీ, ఆ స్థాయి ప్రస్తుత టీమ్ ఇండియా బౌలర్లలో ఉందా...? ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలింగ్ దాడిని చూస్తే 20 వికెట్లు తీసే సత్తా ఈ బౌలింగ్ దళంలో లేదు.. అనే మాటే వస్తోంది. పేస్ గుర్రం బుమ్రా ఒక్కడే బౌలర్ అన్నట్లుగా కనిపించిం.

విదేశాల్లో టెస్టు మ్యాచ్ నెగ్గడం అంటే మామూలు మాటలు కాదు. అది కూడా రోహిత్, కోహ్లి, అశ్విన్ వంటి దిగ్గజాలు రిటైరైన ప్రస్తుత పరిస్థితుల్లో.. అందుకే శుబ్ మన్ గిల్ సారథ్యంలోని టీమ్ ఇండియా ఇంగ్లండ్ లో ఎలా ఆడుతుందోననే అనుమానాలు వచ్చాయి. అయితే, బ్యాటింగ్ లో ఓపెనర్ జైశ్వాల్, కెప్టెన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సెంచరీలతో 471 పరుగుల మెరుగైన స్కోరు చేసింది భారత్. కానీ, బౌలింగ్ లో మాత్రం తేలిపోతోంది.

శనివారం ఇంగ్లండ్ బ్యాటింగ్ ను భారత బౌలర్లలో ఒక్క బుమ్రా తప్ప ఎవరూ ఇబ్బంది పెట్టలేకపోయారు. బుమ్రా బంతులు ఇంగ్లండ్ బ్యాటర్లకు బుల్లెట్లులాగా కనిపిస్తే మిగతా వారి బంతులు బఠానీల తరహాలో కనిపించాయి. ఇంగ్లండ్ కోల్పోయిన మూడు వికెట్లను బుమ్రాను తీయడం గమనార్హం. ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ బ్రూక్ ను కూడా ఔట్ చేసినా అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కూడా సాధారణ బౌలర్ గా మారిపోయాడు. కొత్త కుర్రాడు ప్రసిద్ధ్ క్రిష్ణ బౌన్స్ తప్ప స్వింగ్ లేకపోవడంతో బ్యాట్స్ మెన్ ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాడు.

బుమ్రా లేకుంటే..?

ఒకవేళ బుమ్రా లేకుంటే ఈ సిరీస్ లో భారత్ పరిస్థితి ఏమిటి? ఇంగ్లండ్ బ్యాటింగ్ ను అతడు ఓ ఎండ్ నుంచి పడగొడుతున్నా.. మరో ఎండ్ లో మద్దతే లేదు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అని చెప్పి శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నా.. అతడు మరీ దండగ అనిపించాడు. 40వ ఓవర్ లో ఠాకూర్ కు బంతినివవ్వడం ఏమిటో కెప్టెన్ గిల్ సమాధానం చెప్పాలి. ఇక స్పిన్నర్ రవీంద్ర జడేజా తనవంతు ప్రయత్నం చేసినా.. పిచ్ అనుకూలం కాదు కాబట్టి అతడినుంచి అంతకుమించి ఆశించలేం. పేస్ బౌలింగ్ లో ఇదే పరిస్థితి ముందుముందు కూడా కొనసాగితే సిరీస్ నెగ్గడం కష్టమే అని గిల్ గుర్తించాలి.

బుమ్రా ఇప్పటికే గాయాలతో రెండుమూడుసార్లు టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. ఈ సిరీస్ లోనూ అన్ని మ్యాచ్ లు ఆడబోడని చెప్పారు. మరి అలాగైతే ఎలా..? అతడిపై పనిభారం పెరిగినా ఇబ్బందే కదా..? ఇదే విషయమై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. బుమ్రాకు తోడుగా మిగతా బౌలర్లు కూడా రాణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. శనివారం బుమ్రా 48 పరుగులకు మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు 140 పైగా పరుగులు ఇచ్చారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు... బుమ్రాకు మిగతావారికి తేడా ఏమిటో చెప్పేందుకు.