Begin typing your search above and press return to search.

ఇక క్రికెట్ విజయోత్సవాలు అల్లాటప్పా కాదు.. బీసీసీఐ కొత్త రూల్స్

ఐపీఎల్ నిర్వహణతోనే బీసీసీఐ బాధ్యత ముగిసింది. విజేత జట్టు ఆ తర్వాత ఏం చేసినా.. సంబంధిత ఫ్రాంచైజీ యాజమాన్యానిదే బాధ్యత.

By:  Tupaki Desk   |   23 Jun 2025 7:00 PM IST
ఇక క్రికెట్ విజయోత్సవాలు అల్లాటప్పా కాదు.. బీసీసీఐ కొత్త రూల్స్
X

ఈ నెల ప్రారంభంలోనే జరిగిన అత్యంత విషాద ఘటన బెంగళూరు తొక్కిసలాట... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ ను తొలిసారి గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆ విజయోత్సవాన్ని 24 గంటల్లోపే జరుపుకోవాలని భావించింది. ఈ క్రమంలో తమ సొంత మైదానం ప్రఖ్యాత చిన్నస్వామి మైదానం వద్ద ఏర్పాట్లు చేసింది. ఈ నెల 3న రాత్రి ఐపీఎల్ కప్ గెలిచి.. గంటల వ్యవధిలోనే 4న బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలనుకోవడం.. అదికాకుండా చివరకు జట్టుకు సన్మానం చేయాలనుకోవడం.. ఇలా పరిణామాలు చకచకా జరిగిపోయాయి. చివరకు తొక్కిసలాటకు దారితీసి 11 మంది ప్రాణాలు పోయాయి.

ఐపీఎల్ నిర్వహణతోనే బీసీసీఐ బాధ్యత ముగిసింది. విజేత జట్టు ఆ తర్వాత ఏం చేసినా.. సంబంధిత ఫ్రాంచైజీ యాజమాన్యానిదే బాధ్యత. వాస్తవానికి ఆర్సీబీని సన్మానించడం అనే బెంగళూరు ఈవెంట్ ను తలకెత్తుకున్నది కర్ణాటక ప్రభుత్వం. అలాగని బీసీసీఐ కూడా పూర్తిగా తప్పించుకోలేదు. అందుకే కొత్తగా విజయోత్సవాలకు రూల్స్ తీసుకొచ్చింది.

ఐపీఎల్ విజేతలు గెలిచిన వెంటనే ఈ నిబంధనలు తప్పక పాటించాలని బీసీసీఐ పేర్కొంది. దాని ప్రకారం టైటిల్ గెలిచిన జట్టు 3-4 రోజుల తర్వాతే విజయోత్సవాలు చేసుకోవాలి. ఇందుకోసం కచ్చితంగా బీసీసీఐ అనుమతి తీసుకోవాలి. నాలుగు అంచెల భద్రత తప్పనిసరి. జిల్లా అధికారులు, పోలీసుల నుంచి అనుమతి పొందాలి. విమానాశ్రయం నుంచి విజయోత్సవ వేదిక (ఈవెంట్ వేదిక) వరకు భద్రత ఉండాలి అని నిర్దేశించింది.

ఇవన్నీ బెంగళూరు తొక్కిసలాట ఘటన ఫీడ్ బ్యాక్ గా భావించవచ్చు. ఎందుకంటే.. అహ్మదాబాద్ లో ఈ నెల 3న ఫైనల్ జరగ్గా, 4న మధ్యాహ్నానికే ఆర్సీబీ బెంగళూరు చేరకుంది. 12 గంటల వ్యవధిలోనే బెంగళూరు వీధుల్లో పరేడ్ కు ఫ్రాంచైజీ యాజమాన్యం సిద్ధపడింది. ట్రాఫిక్ కారణంగా పోలీసుల అనుమతి లేకపోవడంతో అది వాయిదా పడింది. పైగా బీసీసీఐ అనుమతి కూడా తీసుకోలేదు. భద్రతా ఏర్పాట్లు చేయడానికి కూడా సమయం లేకపోయింది. ఆఖరికి అది తీవ్ర విషాదానికి దారితీసింది. అందుకనే ఇప్పుడు టైమ్ ఫ్రేమ్ తో బీసీసీఐ కొత్త రూల్స్ పెట్టింది. 3-4 రోజుల సమయం అంటే.. అప్పటికి విజయం తాలూకు జోష్ తగ్గి.. అభిమానులు కూడా పోటెత్తకుండా ఉంటారు. పోలీసు భద్రతతో ముడిపెట్టడంతో వారి అనుమతి రాకుంటే ప్రోగ్రాం జరగదు. మొత్తానికి బీసీసీఐ ముందుజాగ్రత్త పడుతోంది.