ఆసియా కప్... ఆ ఒక్కడి స్థానంపైనే తీవ్రస్థాయి చర్చ!
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్... ఇప్పటికే టి20 ఓపెనర్ గా సత్తా చాటిన అభిషేక్ శర్మ.. టెస్టు కెప్టెన్ గా తొలి పర్యటనలోనే అదరగొట్టిన శుబ్ మన్ గిల్..
By: Tupaki Desk | 14 Aug 2025 2:00 AM ISTవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్... ఇప్పటికే టి20 ఓపెనర్ గా సత్తా చాటిన అభిషేక్ శర్మ.. టెస్టు కెప్టెన్ గా తొలి పర్యటనలోనే అదరగొట్టిన శుబ్ మన్ గిల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టాపర్ గా దుమ్మురేపిన సాయి సుదర్శన్.. అన్ని దేశాలలో సెంచరీలు కొడుతున్న ఓపెనర్ యశస్వి జైశ్వాల్... వీరందరినీ కాదని ఓ ప్లేయర్ విషయమై ఇప్పుడు తీవ్ర చర్చ జరగుతోంది...? ఇంతటి ప్రతిభావంతులైన కుర్రాళ్లను కాదని చర్చ జరుగుతోన్న ఆ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారా?
ఐపీఎల్ ఫినిషర్ గా..
ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలవడంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేష్ శర్మది కీలక పాత్ర. ఫినిషర్ గా లోయరార్డర్ లో అతడు అద్భుతమైన పాత్ర పోషించాడు. దీంతోనే ఆర్సీబీకి విజయాలు సులభంగా దక్కాయి. విధ్వంసక ఇన్నింగ్స్ లతో జితేష్ తనను టీమ్ ఇండియాలోకి తీసుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాడు. సరిగ్గా నెల రోజుల్లో ఆసియా కప్ (టి20 ఫార్మాట్) జరగనుండగా జితేష్ స్థానం ఏమిటా? అని ప్రశ్నలు వస్తున్నాయి.
సంజూ ఉండగా...
టీమ్ ఇండియాలో టి20 ఫార్మాట్ వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ నిలదొక్కుకున్నాడు. ఓపెనర్ కూడా కావడంతో అతడి ఎంపిక ఖాయం. రిషభ్ పంత్ పాదం గాయంతో, ఇషాన్ కిషన్ స్కూటీ నుంచి కిందపడి దూరమయ్యారు. మరో వికెట్ కీపర్ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను టి20లకు పరిగణించకపోవచ్చు. ఈ క్రమంలోనే సంజూకు బ్యాకప్ గా అయినా జితేష్ ను ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
మిగతా జట్టంతా ఓకే..
ఆసియా కప్ నకు ఒక్క బ్యాకప్ వికెట్ కీపర్ (అదీ జితేష్) విషయం తప్ప టీమ్ ఇండియా మిగతా జట్టు ఎంపికపై సెలక్టర్లకు పెద్దగా ఇబ్బంది లేనట్లే. జైశ్వాల్, సాయిలకు అవకాశం కష్టమే. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తరహాలోనే 360 డిగ్రీ బ్యాటర్ అయిన జితేష్ ను కాకుండా యువ కీపర్ ధ్రువ్ జురెల్ ను తీసుకుంటారా? అనేది చూడాలి. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో ధ్రువ్ ప్రతిభ చాటాడు. మంచి బ్యాటర్ కూడా. అయితే, జితేష్ చివరి ఓవర్లలో విధ్వంసక ఆటతో చెలరేగుతాడు. ఒత్తిడి ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఆసియా కప్ లో అతడే మంచి ఆప్షన్ అని అంటున్నారు. సెలక్టర్లు ఈ నెల 19-20 తేదీల్లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.