Begin typing your search above and press return to search.

భారత సంతతికి చెందిన వినయ్ ప్రసాద్‌ కు తిరిగి అమెరికా అందలం

ఆయన కొన్ని రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. కానీ కేవలం కొన్ని రోజుల్లోనే సంస్థ అభ్యర్థన మేరకు మళ్లీ అదే పదవిలోకి తిరిగి వచ్చారు.

By:  A.N.Kumar   |   11 Aug 2025 3:00 PM IST
భారత సంతతికి చెందిన వినయ్ ప్రసాద్‌ కు తిరిగి అమెరికా అందలం
X

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ (FDA)లో టాప్ వ్యాక్సిన్‌, జీన్‌ థెరపీ నియంత్రణాధికారిగా పనిచేసిన భారతీయ సంతతి పరిశోధకుడు వినయ్ ప్రసాద్‌ రాజీనామా చేసి తిరిగి తన పదవిలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కొన్ని రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. కానీ కేవలం కొన్ని రోజుల్లోనే సంస్థ అభ్యర్థన మేరకు మళ్లీ అదే పదవిలోకి తిరిగి వచ్చారు.

అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌ (HHS) ప్రతినిధి ఆండ్రూ నిక్సన్‌, వినయ్ ప్రసాద్‌ తిరిగి సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్‌కు నాయకత్వం వహించనున్నట్లు తెలిపారు. “ట్రంప్‌ ప్రభుత్వం కింద FDA చేస్తున్న ముఖ్యమైన పనిని తప్పుడు వార్తల ద్వారా ఎవరూ దెబ్బతీయనివ్వరు” అని ఆయన స్పష్టం చేశారు.

జూలై 29న ప్రసాద్‌ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేశారు. సరెప్టా థెరప్యూటిక్స్‌ జీన్ థెరపీ సేఫ్టీ ఇష్యూల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలపై వచ్చిన కన్సర్వేటివ్‌ విమర్శలు, అలాగే ట్రంప్ మద్దతుదారైన లారా లూమర్‌ వంటి వారి నుంచి వ్యతిరేకత ఆయన తిరిగి రాకుండా అడ్డుపడ్డాయి.

ఎఫ్‌డీఏలో చేరిన మూడు నెలలకే ప్రసాద్‌ పై విమర్శలు మొదలయ్యాయి. కోవిడ్ వ్యాక్సిన్లపై మరిన్ని అధ్యయనాలు చేయాలంటూ, తన సొంత శాస్త్రీయ సమీక్ష బృందం అభిప్రాయాన్ని తిరస్కరించి, కఠినమైన వైఖరి తీసుకోవడం శాస్త్రీయ ఆవిష్కరణలకు అడ్డంకిగా మారిందని విమర్శలు వచ్చాయి.

గత నెలలో ప్రసాద్‌, ఎఫ్‌డీఏ కమిషనర్ మార్టీ మాకారీలు సరెప్టా తయారు చేసిన డూషెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ చికిత్స మందు ఎలివిడిస్ పంపిణీని ఆపాలని ఆదేశించారు. ఈ నిర్ణయం, ఆ సంస్థ జీన్ థెరపీ వాడిన రోగుల్లో చోటుచేసుకున్న మూడు మరణాల నేపథ్యంలో తీసుకున్నారు.

ప్రసాద్‌ రాజీనామా వార్త బయటకు వచ్చినప్పుడు సరెప్టా షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. అయితే, ఆయన ఎఫ్‌డీఏలో తిరిగి చేరడం, అలాగే మిగతా రెండు పదవులు (చీఫ్ సైన్స్ ఆఫీసర్‌, చీఫ్ మెడికల్ ఆఫీసర్) కూడా పొందుతారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.