వీసా ఆలస్యం.. విద్యార్థులకు ఆశగా మారిన అమెరికా చదువు!
సాధారణంగా చాలామంది విద్యార్థులు అమెరికాలో చదవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు.
By: Madhu Reddy | 6 Aug 2025 7:11 PM ISTసాధారణంగా చాలామంది విద్యార్థులు అమెరికాలో చదవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. అందుకు దిశగా అడుగులు వేస్తారు కూడా.. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులను చూస్తుంటే.. ఎందుకు అమెరికాలో విద్యను ఎంచుకున్నాము అని విద్యార్థులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ తీసుకున్న అంతర్జాతీయ విద్యార్థులు.. ఇప్పుడు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఏర్పడిన సరికొత్త నిబంధనల వల్ల వారికి వీసాల జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనా .. తాము తరగతులకు వెళ్లకపోతుండడంతో పలువురు విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి వీసా అపాయింట్మెంట్ నిలిపివేతను జూన్ మధ్యలోనే తొలగించినా.. నెల రోజులు దాటుతున్నా.. ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం కాలేదు. దీంతో వేల మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం ఇటు విద్యార్థులపైనే కాదు అమెరికా విద్యా వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. అక్కడి విశ్వవిద్యాలయాల బడ్జెట్లు, ఉన్నత విద్యా కేంద్రం.. అమెరికా ఇమేజ్ ని కూడా దెబ్బతీస్తోందని చెప్పవచ్చు.
ఇప్పటికే దక్షిణ కాలిఫోర్నియాలోని ఫుర్మాన్ యూనివర్సిటీలో ఈ ఏడాది కేవలం 562 మంది మాత్రమే కొత్త విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకున్నారు. గత ఏడాది 613 మంది నమోదు కాగా.. వీసా కారణంగానే ఇప్పుడు విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెప్పవచ్చు.
అటు అమెరికాలోని హరిజోనా స్టేట్ యూనివర్సిటీలో కూడా దాదాపు 1,000 మంది అంతర్జాతీయ విద్యార్థులకు వీసాలు రాలేదు. ఈ విషయాన్ని ఈ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మైఖేల్ క్రో వెల్లడించారు.
ముఖ్యంగా భారత్ - చైనా విద్యార్థులకు వీసా మంజూరులో ఏడు రెట్ల వ్యత్యాసం ఉన్నట్లు ఒక టాప్ యూనివర్సిటీ అధికారి కూడా వెల్లడించారు. కేవలం 100 మంది వరకు అంతర్జాతీయ విద్యార్థులు నమోదు చేసుకునే చిన్న కాలేజీలపై కూడా ఇప్పుడు ఈ ప్రభావం భారీగా పడుతోంది.
ఇకపోతే వీసా రాక ఇబ్బందులు పడుతూ.. సకాలంలో తరగతులకు హాజరుకాలేని వారికోసం కొన్ని విద్యాసంస్థలు కూడా ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయి. అటు అరిజోనా యూనివర్సిటీ ఇలా వీసా రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం లండన్ లో క్యాంపస్ నిర్వహిస్తోంది. యూఎస్ నార్త్ ఈస్టర్ విశ్వవిద్యాలయం రిమోట్ లర్నింగ్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హార్వర్డ్ కెన్నడీ స్కూల్ కూడా తాత్కాలికంగా తమ విద్యార్థులకు సరైన విద్యను అందించడానికి యూనివర్సిటీ ఆఫ్ టొరంటో లోని ముంక్స్ స్కూల్లో అవకాశం కల్పించేలా పరిశీలనలు చేస్తోంది. ఇలా వీసాల ఆలస్యంతో అంతర్జాతీయ విద్యార్థులు సరైన సమయంలో విద్యను అందుకోవడంలో వెనుకడుగు పడుతోందని చెప్పవచ్చు. అటు విద్యార్థులకు సమయం వృధా.. ఇటు యూనివర్సిటీలపై ఆర్థిక భారం కూడా పెరగనుంది. ఇకపోతే ట్రంప్ కార్యవర్గం చర్యలతో ఉన్నత విద్యకు బలమైన కేంద్రంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఆ స్థానం కోల్పోయేలా కనిపిస్తోందని.. వీసా కారణంగా అమెరికా వెళ్లలేని ఎంతోమంది విద్యార్థులు కెనడా, ఆస్ట్రేలియా, యూకే యూనివర్సిటీలో చేరుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే అక్కడ నిర్ణయాలు అక్కడ ఆర్థిక వ్యవస్థ పైనే ప్రభావం చూపుతున్నాయని మరి కొంతమంది హెచ్చరిస్తున్నారు . మరి దీనిపై అటు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.