ఒక్కరోజూ పనిచేయడు.. అయినా రూ.26 లక్షల జీతం..?
అబుధాబీలోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్‌గా మారింది.
By: Tupaki Desk | 22 Jun 2025 5:00 PM ISTఅబుధాబీలోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్‌గా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) నివసించే ఓ భారతీయ వ్యక్తికి, ఒక్కరోజూ ఉద్యోగానికి హాజరుకాకుండానే భారీ మొత్తంలో జీతం లభించింది.
వివరాల్లోకి వెళితే.. ఆ వ్యక్తికి 2024 నవంబరు నుంచి ఐదు నెలల పాటు పని చేసే విధంగా ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్టు జరిగిందట. నెలకు రూ.1.69 లక్షల (దిర్హమ్‌లో సమాన విలువ) జీతం చెల్లించాల్సిందిగా ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఉద్యోగం ప్రారంభమవ్వాల్సిన తేదీ వచ్చినా కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అనేకసార్లు కంపెనీ అధికారులను సంప్రదించినా ‘రావొద్దు’, ‘ఇంకా కాలేదు’ అంటూ నిరుత్సాహపరిచారట.
ఇలా కాలయాపన చేస్తూ ఐదు నెలల కాంట్రాక్టు గడువు ముగిసిపోయింది. తన హక్కులను రక్షించుకునేందుకు ఉద్యోగార్థి అబుధాబీ కోర్టును ఆశ్రయించాడు. "నాకు ఉద్యోగం ఇవ్వలేదని, పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నప్పటికీ అవకాశం కల్పించలేదు" అని వాదించాడు.
దీనిపై స్పందించిన కంపెనీ.. "ఆయన ఒక్కరోజూ ఉద్యోగానికి రాలేదు" అని సమాధానం ఇచ్చింది. అయితే దీన్ని నిరూపించగల సాక్ష్యాలు సమర్పించలేకపోయింది. చివరికి కంపెనీ వాదనలను తోసిపుచ్చిన కోర్టు, ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించిందని తేల్చి, ఉద్యోగికి మొత్తం రూ.26 లక్షల పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు ప్రాధాన్యత ఏమిటంటే... ఒప్పందాలను లెక్కచేయకపోతే, సంస్థలు కూడా చట్టపరంగా కఠినమైన చర్యలకు లోనవుతాయన్న సంగతి స్పష్టమవుతుంది. ఉద్యోగి న్యాయపరంగా తగిన న్యాయం పొందడం సంతోషకర అంశం. అంతేకాకుండా ఇది గల్ఫ్ దేశాల్లో ఉన్న వేలాది మంది ప్రవాసులకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.