Begin typing your search above and press return to search.

బర్త్ డేనే డెత్ డే అయ్యింది.. ఫిలప్పీన్స్ లో తెలుగు విద్యార్థికి విషాదం

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది.

By:  Tupaki Desk   |   3 July 2025 3:38 PM IST
బర్త్ డేనే డెత్ డే అయ్యింది.. ఫిలప్పీన్స్ లో తెలుగు విద్యార్థికి విషాదం
X

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. డాంగ్లీ మండలం కుర్లేం గ్రామానికి చెందిన 23 ఏళ్ల వైద్య విద్యార్థి యోగి జన్మదినాన్నే ఆకస్మికంగా మృతి చెందాడు. ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న ఈ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.

తక్కువ వయసులోనే తన లక్ష్యాన్ని సాధించేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లిన యోగి మూడు సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్లాడు. మూడు నెలల క్రితం సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో సమయం గడిపి, ఇటీవలే మళ్లీ ఫిలిప్పీన్స్‌కు తిరిగివెళ్లాడు.

జూలై 2న యోగి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో గుండెల్లో తీవ్రమైన నొప్పిగా ఉందని యోగి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఆందోళన చెందిన తండ్రి అతడిని వెంటనే ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. కానీ, ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నంలో మెట్ల మీదే కుప్పకూలిపోయిన యోగిని అక్కడి స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే యోగి మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ విషాద వార్తను యోగి స్నేహితులు అతడి కుటుంబానికి తెలియజేశారు. ఒక్కసారిగా బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు తేరుకోలేని దుఃఖంలో మునిగిపోయారు. యోగి పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంలో సహాయపడాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఈ ఘటన విద్యార్థుల ఆరోగ్యంపై అవగాహన అవసరమన్న పాఠాన్ని మన ముందుంచుతోంది. అంతర్జాతీయ విద్యకు వెళ్లే యువత తమ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోగి మృతిపై సమాజం సంతాపాన్ని తెలియజేస్తోంది.