F1 వీసా టార్చర్.. నెమ్మదిగా డ్రైవ్ చేసినా SEVIS రద్దు ? అమెరికాలో విద్యార్థులకు నరకం
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులపై రోజురోజుకు వింతైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 24 April 2025 8:15 PM ISTఅమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులపై రోజురోజుకు వింతైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. స్పీడుగా డ్రైవింగ్ చేసినా, నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం కూడా నేరంగా అక్కడి అధికారులు పరిగణిస్తున్నారు. అంతే కాకుండా వారి F-1 వీసాలను కూడా రద్దు చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అటార్నీ స్టీవెన్ బ్రౌన్ తన క్లయింట్ ఒక కేసును సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ విద్యార్థి స్పీడ్ లిమిట్ కంటే 10 mph తక్కువ వేగంతో డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు. అతను డ్రంకన్ డ్రైవ్ టెస్టులో తాగనట్లు తేలినప్పటికీ.. తరువాత బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే అని అధికారులు పట్టుబట్టారు.
నివేదికలో ఎలాంటి మత్తు పానీయాలు సేవించనట్లు తేలినప్పటికీ, అతడిని తక్కువ వేగంతో ట్రాఫిక్‌ను అడ్డుకున్నావంటూ టికెట్ ఇచ్చారు. అతని వేలిముద్రలు తీసుకుంటుండగా, ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అంతర్జాతీయ విద్యార్థుల సమాఖ్య డేటాబేస్ SEVIS (స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ద్వారా అతని లీగల్ స్టేటస్ రద్దు చేసింది.
ఈ సంఘటనకు స్పందించిన మరో అటార్నీ తన క్లయింట్ మరింత దారుణమైన పరిస్థితి గురించి వివరాలు అందించాడు. ఆ విద్యార్థి 4.0 GPAతో PhD చేస్తున్నాడు. క్రిమినల్ రికార్డ్ లేదు. ఎటువంటి ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలు లేవు. అయినప్పటికీ ఎటువంటి వివరణ లేకుండా తన SEVIS స్టేటస్ కోల్పోయాడు.
తాజా డేటా ప్రకారం జనవరి 20 నుండి 4,000 మందికి పైగా విద్యార్థుల SEVIS రద్దు అయింది.ఈ కేసుల్లో దాదాపు 50శాతం మంది భారతీయ విద్యార్థులే. పైన పేర్కొన్న కేసుల మాదిరిగానే చాలా మంది తమ తప్పు లేకుండా ఈ బాధను అనుభవిస్తున్నారు. ఇది కోర్టులో పోరాడుతున్న విద్యార్థులకు మాత్రమే కాకుండా, తమ SEVIS రద్దుకు ఏమి కారణమవుతుందో తెలియని 330,000 మందికి పైగా భారతీయ విద్యార్థులకు కూడా ఒక పీడకలగా నిలుస్తోంది.
న్యాయవాదులు తిరిగి పోరాడటం ప్రారంభించారు. కనీసం మూడు కేసుల్లో బహిష్కరణలను నిరోధించడానికి న్యాయమూర్తులు తాత్కాలిక నిరోధక ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ, తమ చదువుల కంటే తమ లీగల్ స్టేటస్ గురించి భయాందోళనలో ఉన్న విద్యార్థులను శాంతపరచడానికి తక్షణ చర్యలు అవసరం.