మాలీలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్: అల్‌ఖైదా ఘాతుకం
పశ్చిమ మాలీలోని కాయెస్ ప్రాంతంలో ఉన్న డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీపై జూలై 1న జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు.
By: Tupaki Desk | 3 July 2025 11:54 AM ISTపశ్చిమ మాలీలోని కాయెస్ ప్రాంతంలో ఉన్న డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీపై జూలై 1న జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ దాడికి అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ (JNIM) బాధ్యత వహించింది. సాయుధ దుండగులు ఆకస్మికంగా ఫ్యాక్టరీపై దాడి చేసి, అక్కడి కార్మికులను బలవంతంగా తీసుకెళ్లారు. కిడ్నాప్‌కు గురైన వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్టు అధికారికంగా నిర్ధారణ అయింది. అయితే, వారి పేర్లు, స్వస్థలాల వివరాలు ఇంకా వెల్లడించలేదు.
భారత విదేశాంగ శాఖ ప్రకటన
ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిని ఖండించిన శాఖ, మాలీ రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. కిడ్నాప్‌కు గురైన వారి కుటుంబాలకు సమాచారం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా పేర్కొంది.
మాలీ ప్రభుత్వానికి విజ్ఞప్తి
భారత ప్రభుత్వం, కిడ్నాప్‌కు గురైన ముగ్గురు భారతీయులను సురక్షితంగా, త్వరగా విడిపించడానికి చర్యలు తీసుకోవాలని మాలీ ప్రభుత్వాన్ని కోరింది. ఇలాంటి హింసాత్మక ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ శాఖ నొక్కి చెప్పింది.
భారతీయులకు హెచ్చరిక
మాలీలో నివసిస్తున్న ఇతర భారతీయులను అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. అత్యవసర సహాయం అవసరమైతే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ప్రమాదాల్లో చిక్కుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.