Begin typing your search above and press return to search.

అమెరికాలో కళ్లద్దాలు దొంగిలించి తెలుగు విద్యార్థి అరెస్టు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఒక తెలుగు విద్యార్థి దొంగతనానికి పాల్పడి పోలీసులకు పట్టుబడటంతో విదేశాల్లో ఉన్న భారతీయుల పరువుకు మరోసారి భంగం వాటిల్లింది

By:  Tupaki Desk   |   21 Jun 2025 4:00 AM IST
అమెరికాలో కళ్లద్దాలు దొంగిలించి తెలుగు విద్యార్థి అరెస్టు
X

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఒక తెలుగు విద్యార్థి దొంగతనానికి పాల్పడి పోలీసులకు పట్టుబడటంతో విదేశాల్లో ఉన్న భారతీయుల పరువుకు మరోసారి భంగం వాటిల్లింది. కిరణ్‌ అనే యువకుడు 'సంగ్లాస్‌ హట్‌' అనే కళ్లద్దాల దుకాణం నుండి సుమారు రూ. 47,000 (563 అమెరికన్ డాలర్లు) విలువైన బ్రాండెడ్ కళ్లద్దాలను దొంగిలించేందుకు ప్రయత్నించాడని స్థానిక పోలీసులు వెల్లడించారు.

కిరణ్ దుకాణంలోకి వెళ్లి, విలువైన కళ్లద్దాలను తన సంచిలో దాచుకుని, వాటికి డబ్బు చెల్లించకుండానే బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడి సీసీ కెమెరాల ద్వారా ఈ ఘటనను గమనించిన దుకాణం సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే కిరణ్‌ను అదుపులోకి తీసుకుని, దొంగిలించిన కళ్లద్దాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని దుకాణ యాజమాన్యానికి తిరిగి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సంఘటనపై హ్యారీస్ కౌంటీ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ "మీరు మీ సరుకులకు డబ్బు చెల్లించనట్లయితే.. మా ప్రీసింట్ 4కి రాకండి. అరెస్ట్ అవ్వడం ఖాయం" అని హెచ్చరించారు.

ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా, ఇలాంటి ఘటనలు భారత విద్యార్థులకు మరిన్ని సమస్యలను సృష్టిస్తాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు విద్యార్థులు అమెరికా వెళ్లే ప్రక్రియను ఇలాంటి సంఘటనలు మరింత క్లిష్టతరం చేయవచ్చని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో కిరణ్ రాపర్తి కుటుంబం, స్నేహితులు కూడా తీవ్ర అవమానానికి గురవుతున్నారు.

ఇలాంటి పనులు భారతీయుల ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే యువతకు కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయులు ఇటువంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.