కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు కేసు.. సుప్రీంలో కీలక పరిణామం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
By: Tupaki Desk | 29 April 2025 3:06 PM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య జరిగి దాదాపు ఆరేళ్లు అవుతున్నా, కేసు విచారణ పూర్తి కాకపోవడంపై బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసులో ప్రధాన నిందితులకు సహకరించారనే విమర్శలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా తన అభిప్రాయాన్ని అఫిడవిట్ ద్వారా సమర్పించడంతో అవినాశ్ భవితవ్వంపై సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమైంది.
ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సునీతరెడ్డి వేసిన పిటిషనులో ఏపీ ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారనుందని అంటున్నారు. గతంలో ప్రభుత్వం అనుకూలంగా ఉండటంతో అవినాశ్ రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకుని, ముందస్తు బెయిల్ తెప్పించుకున్నారని చెబుతున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో అవినాశ్ రెడ్డికి అంత సానుకూలత కనిపించడం లేదని చెబుతున్నారు. వివేకా హత్య కేసును పునర్విచారించాలని, సాధ్యమైనంత వేగంగా నిందితులను శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పట్టుదల చూపుతున్నారని చెబుతున్నారు. దీంతో ఎంపీ అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయా? అనే అనుమానమే ఎక్కువగా వ్యాపిస్తోంది. మరోవైపు ఈ కేసు విచారణ జరుపుతునన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం పదవీకాలం వచ్చే నెలఖరుతో ముగియనుంది. దీంతో ఈ కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. కొత్త సీజేఐగా ఎంపికైన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు కేసును విచారించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
కాగా, కేసు విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాదులు నిందితుడు అవినాశ్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని డిమాండు చేశారు. ఆయన బయట ఉంటే సాక్షాలు తారు మారు చేస్తారని, సాక్ష్యులను బెదిరిస్తున్నారని సునీత తరఫు న్యాయవాదులు ఆరోపించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పైనా వాదనలు జరిగాయి. సీబీఐ ఎస్పీ రాంసింగ్, పిటిషనర్ సునీత దంపతులపై గతంలో దాఖలైన కేసులో నిజం లేదని, ఎంపీ అవినాశ్ రెడ్డి ఇద్దరు పోలీసు అధికారులతో వీరిపై తప్పుడు కేసు పెట్టించారని సుప్రీంకోర్టుకు నివేదించారు. ఇక పిటిషనర్ సునీత, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు ముగియడంతో కౌంటర్ దాఖలుకు తమకు సమయం కావాలని ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫున లాయర్లు కోరారు. దీంతో కేసు తదుపరి విచారణను జూలై నెలాఖరుగా వాయిదా వేశారు.