పెగాసస్ వివాదం... సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 2021లో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 April 2025 1:55 PM ISTపెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 2021లో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో వాదనలు విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
అవును... దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసే ఏ నివేదికను బహిర్గతం చేయబోమని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. కానీ.. గోప్యత ఉల్లంఘనకు సంబంధించిన వ్యక్తిగత భయాలను ఇది పరిష్కరించవచ్చని సూచించింది. ఇదే సమయంలో... సాంకేతిక కమిటీ నివేదికను వీధుల్లో చర్చకు పత్రంగా మార్చరాదని ధర్మాసనం పేర్కొంది.
ఇదే క్రమంలో... ఒక దేశం స్పైవేర్ ను కలిగి ఉండటం తప్పుకాదని అయితే.. మీరు దాన్ని ఎవరిపై ఉపయోగిస్తున్నారనేది ప్రశ్న అని అది పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పౌర సమాజ వ్యక్తిపై స్పైవేర్ ఉపయోగించినట్లయితే దానిని పరిశీలిస్తామని సుప్రీకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా స్పైవేర్ అనధికారిక వినియోగాన్ని దర్యాప్తు చేయాలన్న పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది.
ఈ సందర్భంగా... పెహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్థావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసని.. ఈ సమయంలో మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ విచారణ సందర్భంగా... పిటిషనర్లలో ఒకరి తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. యూఎస్ జిల్లా కోర్టు తీర్పు ఉందని సమర్పించారు. వాట్సప్ హ్యాకింగ్ గురించి చెప్పిందని అన్నారు. దీంతో... జూలై 30న ఈ విషయాన్ని విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది!
కాగా... ఇజ్రాయెల్ కు చెందిన ఎన్.ఎస్.ఓ. గ్రూపు అనే సంస్థ "పెగాసస్" స్పైవేర్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. నిఘా కార్యక్రమాల కోసం ఈ స్పైవేర్ ను ఎన్.ఎస్.ఓ పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీనలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. ఈ సమయంలో 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది.
ఇందులో భాగంగా... ఈ స్పైవేర్ ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారంటూ ఆ కథనంలో పేర్కొంది. ఈ సమయంలో భారత్ నుంచి 300 మంది ఫోన్లు హ్యాక్ అయినట్లు పేర్కొంది. వీరిలో రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే పెఫాసస్ పై విచారణకు సుప్రీం ఆదేశించి, కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక రూపొందించింది.