Begin typing your search above and press return to search.

ఓటీటీ, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్.. కేంద్రాన్ని సూటిగా కోరిన సుప్రీంకోర్టు

సోమవారం నాడు జస్టిస్ బీఆర్‌ గువాయ్‌, జస్టిస్ అగస్టీన్‌ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   28 April 2025 3:48 PM IST
ఓటీటీ, సోషల్ మీడియాలో  అశ్లీల కంటెంట్.. కేంద్రాన్ని సూటిగా కోరిన సుప్రీంకోర్టు
X

పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న అశ్లీల, లైంగిక అసభ్యకర కంటెంట్‌ను నియంత్రించాల్సిన ఆవశ్యకతపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. ఈ అంశంపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

సోమవారం నాడు జస్టిస్ బీఆర్‌ గువాయ్‌, జస్టిస్ అగస్టీన్‌ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లోని లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించేందుకు ఒక నేషనల్ కంటెంట్‌ కంట్రోల్‌ అథారిటీని ఏర్పాటుచేసి, తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఐదుగురు పిటిషనర్లు తమ అభ్యర్థనలో కోరారు.

ఈ అంశంపై ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి సుప్రీంకోర్టు కేంద్రం నుంచి సమాచారం కోరింది. దీనికి కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బదులిస్తూ.. అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి ఇప్పటికే కొన్ని నిబంధనలు అమలులో ఉన్నాయని, భవిష్యత్తులో ఈ విషయంలో మరిన్ని కఠినమైన నిబంధనలను తీసుకువస్తామని తెలిపారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఓటీటీ, సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి కంటెంట్‌ కారణంగా పిల్లలు, యువతతో పాటు పెద్దల ఆలోచనలు కూడా కలుషితమవుతున్నాయని పేర్కొంది. ఇది వికృతమైన, అసహజమైన లైంగిక ధోరణులకు దారితీస్తుందని, తద్వారా దేశంలో నేరాల రేటు పెరిగే ప్రమాదం ఉందని ధర్మాసనం హెచ్చరించింది.

ఈ సందర్భంగా, పిటిషనర్ లేవనెత్తిన అంశం పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల పరిధిలోని ఒక ముఖ్యమైన సమస్య అని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై జస్టిస్ బీఆర్‌ గువాయ్‌ మాట్లాడుతూ.. తాము ఇప్పటికే పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామని తమపై ఆరోపణలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కేంద్రంతో పాటు సంబంధిత ప్లాట్‌ఫామ్‌ల నుంచి సుప్రీంకోర్టు తదుపరి స్పందన కోసం వేచిచూడనుంది.