ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంలో షాక్
లిక్కర్ స్కాంలో కీలక నిందితులు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
By: Tupaki Desk | 16 May 2025 8:40 AMలిక్కర్ స్కాంలో కీలక నిందితులు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం వారు పెట్టుకున్న పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ దశలో కల్పించుకుని నిందితులకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ కు నిరాకరించడంతో నిందితులు ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల తీర్పు రావడంతో సిట్ తీసుకుబోయే చర్యలు ఆసక్తి రేపుతున్నాయి.
ముందస్తు బెయిల్ నిరాయకరించడంతో మద్యం స్కాంలో నిందితులైన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. ప్రస్తుతం నిందితులను సిట్ విచారిస్తోంది. అరెస్టు భయంతో సిట్ విచారణకు తొలుత డుమ్మా కొట్టిన నిందితులు.. ముందస్తు బెయిల్ విచారణ సమయంలో సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో సిట్ ఎదుటకు వచ్చిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా నిందితులను విచారించిన సిట్ అధికారులు, శుక్రవారం కూడా విచారణకు రమ్మని పిలిచారు.
ఇలాంటి సమయంలో వారి ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఇప్పుడేం జరగనుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ రోజు విచారణలోనే ఏ31 ధనుంజయరెడ్డి, ఏ32 క్రిష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విచారణకు రమ్మని పిలిస్తే ఆ ఇద్దరూ పరార్ అవ్వడంతో ఇప్పుడు వదిలిపెట్టి, వారు తప్పించుకునే అవకాశాలు కల్పించరని అంటున్నారు. న్యాయస్థానాలు కూడా సిట్ చర్యలను సమర్థించేలా తీర్పునివ్వడంతో నిందితుల అరెస్టుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో అరెస్టు నుంచి నిందితులు తప్పించుకోలేరని అంటున్నారు. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడమే కాకుండా, రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో నిందితుల అరెస్టుకు పరోక్ష సంకేతాలిచ్చినట్లేనని అంటున్నారు. సుప్రీం తీర్పుతో సిట్ నిందితులను అరెస్టు చేస్తే ఈ కేసు మరో లెవెల్ కు చేరుకున్నట్లే అంటున్నారు.