మాజీలు జాతీయ జెండా వాడితే.. కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు
మాజీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. జాతీయ జెండా.. చిహ్నం వాడే అంశంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 26 April 2025 11:00 AM ISTపదవి పోయిన తర్వాత కూడా ఆ రాజసాన్ని కంటిన్యూ చేయాలని భావించే నేతలు కొందరు ఉంటారు. అలాంటి వారికి నిబంధనలు అస్సలు పట్టవు. అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు. మాజీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. జాతీయ జెండా.. చిహ్నం వాడే అంశంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా ఉదంతాలకు సంబంధించి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచన చేసింది. ఈ తరహా అంశాలపై కఠిన మార్గదర్శకాల్ని రూపొందించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేసింది.
మాజీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు జాతీయ జెండాను.. చిహ్నాన్ని అనధికారికంగా ఉపయోగించే తీరును ఆపాలని కోరుతూ కర్ణాటక హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టారు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ అంజరియా.. జస్టిస్ ఎం.ఐ. అరుణ్ సభ్యులతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం.
పదవిలో లేని నేతలు తమ లెటర్ హెడ్ మీద కానీ.. వాహనాల మీద కానీ జాతీయ చిహ్నాలను ప్రదర్శించటం దురద్రష్టకరమని.. తప్పుదారి పట్టించే చర్యగా స్పష్టం చేసింది. ఈ తరహా చర్యలు ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపుతాయని పేర్కొంది. జాతీయ జెండా.. చిహ్నం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్ట అమలు సంస్థలు వేగంగా.. సమర్థంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరి.. దీనిపై కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రీతిలోరియాక్టు అవుతాయో చూడాలి.