గీత దాటుతున్నారు: 2 రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?
ఏపీలో సోషల్ మీడియాలో విమర్శలు చేశారని, పోస్టులు పెట్టారని పేర్కొంటూ.. ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో యువతను పోలీసులు అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 7 July 2025 9:45 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులు.. ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. గీత దాటుతున్నారు.. అంటూ.. ఏపీ హైకోర్టు కూటమి ప్రభుత్వాన్ని, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారును కూడా సునిశితంగా హెచ్చరించిన పరిస్థితి.. కనిపిస్తోంది. మరి ఎందుకిలా జరుగుతోంది? అసలు ఏం జరుగుతోంది? అనేది ఆసక్తిగా మారింది. ఏపీలో పోలీసులను, తెలంగాణలో రెవెన్యూ ఉద్యోగులను ఉద్దేశించి కోర్టులు వ్యాఖ్యలు చేశాయని ప్రభుత్వాలు తప్పించుకుంటే.. అది మరింత తప్పవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఏపీలో ఏం జరిగింది?
ఏపీలో సోషల్ మీడియాలో విమర్శలు చేశారని, పోస్టులు పెట్టారని పేర్కొంటూ.. ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో యువతను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను స్థానిక కోర్టులు రిమాండుకు పంపించాయి. ఇదేసమయంలో వైసీపీ నేతలపై దాఖలైన కేసుల విషయంలో విచారణ చేసి తీర్పులు ఇచ్చిన జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై ట్రోల్స్ వచ్చాయి. వైసీపీ కాబట్టి.. బెయిల్ ఇచ్చారని వ్యాఖ్యానిస్తూ.. ఓ పార్టీకి చెందిన నాయకులు ట్రోల్స్ చేశారు.
ఈ రెండు పరిణామాలపైనా హైకోర్టు సీరియస్ అయింది. ట్రోల్స్ విషయాన్ని సీరియస్‌గానే పరిగణిస్తున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ చెప్పారు. న్యాయవ్యవస్థకు రాజకీయాలను ఆపాదిస్తే.. చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇదొక భాగం అయితే.. మేజిస్ట్రేట్‌లు విధిస్తున్న రిమాండ్లను హైకోర్టు నేరుగానే తప్పుబట్టింది. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో కూడా తమకు అర్ధం కావడం లేదని.. వ్యాఖ్యానిస్తూనే.. మేజిస్ట్రేట్లకు లక్ష్మణ రేఖలు గీసింది. గీత దాటుతున్నారని వ్యాఖ్యానించింది.
తెలంగాణలో..
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న భూముల విషయం వివాదంగా మారింది. శిఖం భూములు, శిఖం సర్కారీ భూములకు పరిహారం ఇవ్వడం లేదని రైతులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. రెవెన్యూ అధికారులకు చట్టం గురించి తెలియడం లేదా? అని నిశిత ప్రశ్న సంధించింది. ఎలా పనిచేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదని పేర్కొంది. శిఖం భూములకు పరిహారం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ రెండు అంశాలు కూడా.. న్యాయ వర్గాల్లోనే కాదు.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చగా మారాయి. గీత దాటుతున్నారన్న వ్యాఖ్యలు .. సర్కార్లను ఉద్దేశించి చేసినవేనని.. అంటున్నారు. మరి ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అనే సూచనలు వస్తున్నాయి.