సాక్ష్యం సరిగా చెప్పని ఫిర్యాదుదారికి ఏడాది జైలుశిక్ష
అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.
By: Tupaki Desk | 8 July 2025 9:39 AM ISTఅనూహ్య పరిణామానికి వేదికైంది ఏలూరు ఏసీబీ కోర్టు. కంప్లైంట్ చేసిన ఫిర్యాదుదారు.. కోర్టులో సరైన రీతిలో సాక్ష్యం చెప్పని వైనంపై కఠినంగా స్పందించింది. ఏసీబీ అధికారుల రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న హౌసింగ్ సంస్థ ఏఈ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పని ఫిర్యాదుదారు విషయంలో అనూహ్య రీతిలో శిక్షను విధించిన వైనం సంచలనంగా మారింది. ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది.
అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కేసావరం గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగలక్ష్మి.. సుంకర దైవక్రప గతంలో హౌసింగ్ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించుకున్నారు. 2009లో వాటి బిల్లుల మంజూరుకు అప్పటి ఉండ్రాజవరం మండల హౌసింగ్ సంస్థ ఏఈ ప్రకాశ్ రావు వీరి ఒక్కొక్కరి నుంచి రూ.3వేలు చొప్పున లంచం డిమాండ్ చేశారు. ఈ అంశంపై లబ్థిదారుల తరఫు అదే గ్రామానికి చెందిన గణేశ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు.. సదరు అధికారి లబ్థిదారుల వద్ద లంచం తీసుకుంటున్న సందర్భంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు తుది విచారణలో ఫిర్యాదు చేసిన గణేశ్ సరిగా సాక్ష్యం చెప్పలేదు. దీంతో.. లంచం తీసుకున్న ప్రకాశ్ రావుపై కేసు కొట్టేసిన కోర్టు.. గణేశ్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. తాజాగా రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో ఈ కేసు తుది విచారణ చేపట్టారు. కంప్లైంట్ చేసి.. తర్వాత సాక్ష్యం సరిగా చెప్పని గణేశ్ చేసిన నేరం రుజువు కావటంతో అతనికి ఏడాది జైలు.. రూ.5 వేలు ఫైన్ విధిస్తూ న్యాయమూర్తి తుది తీర్పును ఇచ్చారు. సాక్ష్యం చెప్పటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అతడికి ఊహించని షాక్ ఎదురైంది.