వైసీపీ ఒంటరితనం... ఆశలు పెంచుతోందా?
దేశంలో అనేక పార్టీలు వచ్చాయి. అవన్నీ కూడా ఏదో ఒక దశలో పొత్తులు పెట్టుకున్నాయి. ఎటువంటి పొత్తులు ఎత్తులు లేకుండా రాజకీయం చేసిన పార్టీ వైసీపీయే.
By: Satya P | 29 Oct 2025 10:37 AM ISTఒకటి ఒంటరి అంకె అని ఎవరూ చెప్పక్కర్లేదు. అది అంతే. ఇక రాజకీయాల్లో ఒంటరితనం పూర్తిగా అనుభవిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఒక్క వైసీపీ మాత్రమే అని అంటారు. వైసీపీది దాదాపుగా చూస్తే పదిహేనేళ్ళ రాజకీయ ప్రస్థానం. ఈ మొత్తం ప్రయాణంలో చూసుకుంటే సింగిల్ సోలో ఈ రెండు పదాలతోనే అడుగులు వేసింది. కాలం కలసి వచ్చి అవే బలమైన నినాదాలుగా మారాయి. ఎంతదాకా అంటే సింహం సింగిల్ గానే వస్తుంది అన్నట్లుగా. అయితే ఈ డైలాగులు ఒక సమయంలో బాగా పేలాలి. అన్ని సమయాలలోనూ కుదరవు అన్నది తరువాత కథ నిరూపించింది.
వ్యూహం మిస్ అయ్యారా :
దేశంలో అనేక పార్టీలు వచ్చాయి. అవన్నీ కూడా ఏదో ఒక దశలో పొత్తులు పెట్టుకున్నాయి. ఎటువంటి పొత్తులు ఎత్తులు లేకుండా రాజకీయం చేసిన పార్టీ వైసీపీయే. అందుకే మూడు ఎన్నికలలో ఒకటి మాత్రమే సానుకూల ఫలితం ఇస్తే రెండు సార్లు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 2024లో అయితే వైసీపీ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. ఓట్ల పరంగా చూస్తే 40 శాతం షేర్ ఉంది కానీ సీట్లు బొత్తిగా 11 కి పడిపోయాయి. దాంతో వైసీపీకి అధికారం కాదు కదా సరైన రాజకీయ గౌరవాన్ని ఇచ్చే స్థాయిలో సీట్లు కూడా దక్కడం కష్టమైంది అన్నది ఈ ఫలితాలు తెలియచేశాయి. ఇలా చూస్తే కనుక వైసీపీ విషయంలోనూ అదే జరుగుతోంది అని అంటున్నారు. ఇక్కడే వైసీపీ రాజకీయ వ్యూహం మిస్ అయింది అని అంటున్నారు.
తప్పు కానే కాదుగా :
ఎన్నికలు అంటే ఎన్నో అంశాలు మిళితం అయి ఉంటాయి. పొత్తులు కూడా ఒక పవర్ ఫుల్ స్ట్రాటజీ. దానిని ఎపుడు ఎలా ఉపయోగించాలో టీడీపీకి తెలిసినంతగా మరే పార్టీకి తెలియదు అందుకే తెలుగుదేశం ఎవరు ఏమనుకున్నా పొత్తులకే వెళ్తుంది దానిని ఎద్దేవా చేస్తూ వైసీపీ భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇపుడు వైసీపీ సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది అని అంటున్నారు. వైసీపీ బలం ఎంత అన్నది 2024 ఎన్నికల్లో రుజువు అయింది. వచ్చే ఎన్నికల నాటికి మరి కొంత బలం సమకూరినా కూడా మూడు పార్టీలు పైగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో ఢీ కొని నెగ్గుకుని రావడం బహు కష్టం అన్న భావన అయితే వ్యక్తం అవుతోంది
కూటమి కట్టాల్సిందేనా :
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. అయితే అదే అపొజిషన్ ఫ్లాట్ ఫారం మీద కాంగ్రెస్ వామపక్షాలు, ఇతర పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలను కలుపుకుని వైసీపీ కూడా ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంటే 2029 ఎన్నికల్లో టీడీపీ కూటమిని గట్టిగా ఢీ కొట్టే స్థితికి చేరుకోవచ్చు అన్నది విశ్లేషణగా ఉంది. అయితే వైసీపీ ఈ విషయంలో ఎంతవరకూ మొగ్గు చూపుతుంది అన్నది చూడాల్సి ఉంది. సింగిల్ గానే అన్నది ఈ రోజుకీ పార్టీలో వినిపిస్తున్న మాట. దానికి వైసీపీ లాజిక్ ఏమిటి అంటే పార్టీలో ఎందరో పనిచేస్తూ ఉన్నారు. వారికి అవకాశాలు తగ్గించి పొత్తుల పేరుతో వేరే పార్టీలకు ఇవ్వడం వల్ల వారు నష్టపోతారు అని. అది కొంతవరకూ నిజమే అనుకున్నా అధికారం దక్కించుకోకపోతే టోటల్ గా పార్టీ నష్టపోతుంది కదా అన్నది మరో వాదనగా ఉంది.
చాలా పరిమితులున్నాయి :
ఏపీలో ఈ రోజుకు చూస్తే వైసీపీ ఒంటరి పార్టీగానే ఉంది. అయితే జై భీమ్ అన్న పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ వంటి వారు వైసీపీతో పొత్తు కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కలసి వెళ్తామని ఆయన ఇప్పటికే చెబుతున్నారు. ఇక ఆమ్ ఆద్మీ బీఎస్పీ లాంటి పార్టీలు కూడా ఉన్నాయి. వాటిని కలుపుకోవాలా వద్దా అన్నది చూడాల్సి ఉంది. వామపక్షాలు రెండు రకాల వైఖరితో వైసీపీ మీద ఉన్నాయి. సీపీఎం అయితే కాస్తా సాఫ్ట్ కార్నర్ తో ఉన్నా సీపీఐ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు, పైగా ఈ రెండూ ఇండియా కూటమిలో జాతీయ స్థాయిలో ఉన్నాయి. కాంగ్రెస్ లేకుండా వామపక్షాలు వైసీపీతో జత కట్టే పరిస్థితి ఉండదు అని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ ని దగ్గరకు తీసే విషయంలో వైసీపీ తన పర్మనెంట్ పొలిటికల్ స్టాండ్ నే మార్చుకోవాల్సి ఉందని అంటున్నారు.
అనివార్యంగానే :
అయితే ఈసారి పొత్తులు వైసీపీకి అనివార్యంగానే ఉన్నాయి అని అంటున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా మూడున్నరేళ్ళ సమయం ఉంది. అప్పటికి ఎన్నో జరుగుతాయని అంటున్నారు. కాంగ్రెస్ తో కచ్చితంగా వైసీపీ నడవాల్సిన పరిస్థితులు రావచ్చు అన్న మాట కూడా ఉంది. ముఖ్యంగా బీహార్ తరువాత జాతీయ రాజకీయాల్లో మార్పు ఏపీ మీద ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు మరో వైపు చూస్తే వైసీపీతో కలిసేందుకు చిన్న పార్టీలు ఆసక్తిగా ఆశగా ఉన్నాయి. వైసీపీ ముందుకు వస్తే కాంగ్రెస్ వామపక్షాలు సైతం సై అంటాయి. మొత్తం మీద వైసీపీ దీర్ఘకాలంగా ఎంచుకున్న రాజకీయ ఒంటరితనం ఈసారి భగ్నం అయ్యే అవకాశాలే అధిక శాతం ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
