వైఎస్సార్ కి తెలిసింది అదే !
మహా నేతగా ప్రజల గుండెలలో శాశ్వతమైన స్థానాన్ని వైఎస్సార్ సంపాదించుకున్నారు. ఆయన అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి కాలేదు.
By: Tupaki Desk | 8 July 2025 12:07 PM ISTమహా నేతగా ప్రజల గుండెలలో శాశ్వతమైన స్థానాన్ని వైఎస్సార్ సంపాదించుకున్నారు. ఆయన అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి కాలేదు. రెండే రెండు సార్లు ఆ పీఠం అధిరోహించారు టోటల్ గా లెక్క కడితే అక్షరాలా అయిదేళ్ల మూడు నెలలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ చరిత్రలో నిలిచి పోయారు. తరగని ఆస్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు.
ఆయన పేదల గురించి ఆలోచన చేసినట్లుగా వేరెవరూ చేయలేదు. పేదవారు ప్రాథమిక అవసరాలు అయిన విద్య వైద్యం విషయంలో విప్లవాత్మకైన నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఆయన మానసపుత్రికగా రూపు దిద్దుకుంది. అంతే కాదు పేదవారు కూడా పెద్ద చదువులు చదువుకోవాలని తపించి ఆయన అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పధకం ద్వారా ఈ రోజున ప్రతీ బీద కుటుంబమూ బాగుపడింది. ఆ కుటుంబంలో నవ్వులు విరబూసాయి.
వీటితో పాటు అనేక ఇతర పధకాలు ఆయన పాలనలో గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా రైతన్నల కోసం ఆయన చేసినట్లుగా ఎవరూ చేయలేదని ఈ రోజుకీ చెప్పుకుంటారు. ఉచిత విద్యుత్ రైతులకు అందించడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. దానిని సక్రమంగా అమలు చేసిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుంది.
వీటితో పాటుగా ఒక నాయకుడు ఎలా ఉండాలో వైఎస్సార్ నిలువెత్తు ఉదాహరణగా కనిపిస్తారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజా దర్బార్ లను ఆయన నిర్వహించారు. తన ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా కాదనకుండా పరిష్కారాలు చూపించారు
ఆయన జిల్లా పర్యటనకు వస్తున్నారు అంటే చాలు అక్కడ వరాల మోత మోగాల్సిందే. అలా చేతికి ఎముక లేదు అన్నట్లుగా ఆయన ప్రజల కోసం అనేక రకాలుగా కార్యక్రమాలు చేసి చూపించారు. ఆయనలో గొప్ప మానవతావాది ఉన్నారు. ఆయన అందరి వాడుగా మారేందుకు అదే కారణం.
ఇక తన పాదయాత్ర తరువాత వచ్చిన కీలక మార్పు గురించి ఆయన చెబుతూ కోపం నరాన్ని తాను తెంపేసుకున్నాను అని చెప్పారు. ఆ మాట అక్షర సత్యమైంది. ఆయన అలాగే చివరి వరకూ స్వచ్చమైన నవ్వుతోనే ఉంటూ వచ్చారు. ఆయన ఉంటే అసెంబ్లీకి నిండు తనం వచ్చేది. ఏ అంశం మీద అయినా సాధికారికంగా ఆయన మాట్లాడినా సభ మొత్తమే కాదు టీవీల ముందు కూర్చున్న జనాలు కూడా నిశ్శబ్దంగా అంతా వినేవారు.
విపక్షంలో ఉన్న సభ్యులు ఆవేశకావేశాలు చూపించినా ఆయన చిరు నవ్వుతోనే పంచులేసేవారు. ఇక ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అపొజిషన్ లో బాబు ఉన్న ఆనాటి సభని చూసేందుకు అంతా ఇష్టపడేవారు. ఒక బ్లాక్ బస్టర్ మూవీకి వచ్చే టీఆర్పీ రేటింగ్ ఆనాటి అసెంబ్లీ సెషన్లకు వచ్చేది.
మరో వైపు చూస్తే వైఎస్సార్ రాజకీయాల్లో అజేయుడిగా నిలిచారు. ప్రజా వైద్యుడిగా వృత్తిగత జీవితాన్ని ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చారు. 1978లో కడప జిల్లా పులివెందుల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో ఆయన మూడు సార్లు ఎంపీ అయ్యారు, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు నిర్వహించారు. పీసీసీ చీఫ్ గా రెండు సార్లు అసెంబ్లీలో విపక్ష నేతగా ఒకసారి చేసి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించారు.
వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నా ఆయన పొలిటికల్ గ్లామర్ ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదిరేది కాదు. ఆయన చుట్టూ ఎపుడూ జనాలే ఉండేవారు. ఇక తనతో ఉన్న వారికి ఆయన చక్కగా చూసుకోవడమే కాదు తాను వారిని నమ్మేవారు తనతో పాటుగా తన ఎదుగుదలతో పాటుగా వారికీ చోటు ఇచ్చేవారు. వారిని కూడా తనతో సమానంగా అందలాలు ఎక్కించిన గొప్ప నాయకుడి లక్షణం ఆయనలో కనిపిస్తుంది.
అంతే కాదు వైఎస్సార్ కి ఉన్న బలం బలహీనత ఒక్కటే. ఆయన అందరినీ నమ్ముతారు. అన్నింటికీ మించి తన వద్దకు వచ్చిన వారికి ఆయన అభయం ఇస్తారు. మళ్ళీ మాట వెనక్కి తీసుకోవడం అన్నది ఉండాదు. అందుకే నిండైన ఆయన రాజకీయ వ్యక్తిత్వం ఎందరికో స్పూర్తిదాయకంగా మారింది. వైఎస్సార్ అన్న మూడు అక్షరాలు తెలుగు రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయాయి.