Begin typing your search above and press return to search.

కామ్రేడ్స్ సంగతేంటి జగన్ ?

కాంగ్రెస్ కి టీడీపీకి మధ్య పరోక్ష బంధం ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి రాహుల్ గాంధీ చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని ఆయన సంచలనం రేకెత్తించేలా మాట్లాడారు

By:  Satya P   |   14 Aug 2025 12:19 AM IST
కామ్రేడ్స్ సంగతేంటి జగన్ ?
X

కాంగ్రెస్ కి టీడీపీకి మధ్య పరోక్ష బంధం ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి రాహుల్ గాంధీ చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని ఆయన సంచలనం రేకెత్తించేలా మాట్లాడారు. అంతే కాదు సంధానకర్తగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కూడా ఆయన్ని మధ్యలోకి లాగారు. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏపీలో జరిగిన ఓట్ల దోపిడి గురించి మాట్లాడలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.

ఒంటరిగానే అంతా :

అయితే ఏపీలో వైసీపీ చేస్తున్న ప్రతీ పోరాటం ఒంటరిగానే ఉంటోంది. ఆ పార్టీ తమది సోలో రూట్ అని మొదటి నుంచి చెబుతోంది. ఇక ఏపీలో ప్రజా సమస్యల మీద అందరి కంటే ఎక్కువగా మాట్లాడేవారు కామ్రేడ్స్. మరి వారు వైసీపీతో పాటే విపక్షంలో ఉన్నారు. వారు వైసీపీకి ఏ విషయంలోనూ మద్దతు ఇవ్వడం లేదు కదా అన్న చర్చ ఉంది. తాజాగా పులివెందులలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. కానీ ఏపీలో సాటి విపక్షాలు అయితే దాని మీద మాట్లాడడం లేదు. ఎందుకిలా అన్నదే వైసీపీ చర్చించుకోవాలని అంటున్నారు.

అవినీతి వైసీపీ కళ్ళకేనా :

ఇక అమరావతిలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోందని నిర్మాణాలు అవుతున్న దాంటో కూడా ప్రతీ దానికీ అధికంగా ఖర్చు చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. అలాగే ఇసుక దందాలు సహా అనేక రకాలుగా ఏపీలో అవినీతి జరిగితే కాంగ్రెస్ నుంచి ఎవరూ మాట్లాడటం లేదని ఆయన మండిపడ్డారు కానీ వామపక్షాలు కూడా ఈ విషయంలో జగన్ అండ్ కో లేవనెత్తుతున్న అంశాల మీద మాట్లాడటం లేదు కదా అన్న చర్చ అయితే వస్తోంది.

లోపం ఎక్కడ ఉందంటే :

విపక్షంలో ఉన్న వైసీపీ సాటి పక్షాలను కలుపుకుని పోవాల్సి ఉందని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ వామపక్షలు ఉన్నాయి. వారి పంధా ఏమిటో ఎలా ఉందో ఆరా తీసి అనుమానాలు వ్యక్తం చేసే కన్నా తమ పోరాటాలకు వారి మద్దతుని కూడా తీసుకునేలా కార్యాచరణ రూపొందిస్తే బాగుంటి కదా అన్న చర్చ వస్తోంది. అలా కాకుండా తామే కూటమిని విమర్శిస్తున్నామని ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడటం లేదని అనడం రాజకీయంగా వ్యూహాత్మకమైన లోపమని అంటున్నారు

ప్రజా సమస్యల మీద కలవాలి :

ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి. కానీ ఈ లోగా ప్రజాసమస్యల మీద కలసి పనిచేయడానికి అభ్యంతరాలు విపక్షాలకు ఉండరాదు అని అంటున్నారు. అధికారంలో ఉన్న కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. విపక్షంలో మఒరో మూడు పార్టీలు ఉన్నాయి. ఇక్కడే పెద్దన్న పాత్ర తీసుకుని వైసీపీ అందరితో కలసి బలమైన ఉద్యమాలు నిర్మిస్తే గొంతు పెద్దగా జనాలకు వినిపిస్తుంది అని అంటున్నారు. అలా కాకుండా విపక్షాలను కెలికితే మరింత ఇబ్బంది అవుతుందని అంతిమంగా వైసీపీ లక్ష్యాన్నే దెబ్బ తీస్తుంది అని అంటున్నారు.