ఏ2 జగన్, వైవీ, విడదల రజనీ కూడా నిందితులే..?
రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వాహనం కింద పడి చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను రెండో నిందితుడు(ఏ2)గా పోలీసులు పేర్కొన్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 9:37 AM ISTరెంటపాళ్ల పర్యటన సందర్భంగా వాహనం కింద పడి చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను రెండో నిందితుడు(ఏ2)గా పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఈ విషయాలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు.
అవును... రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా చీలి సింగయ్య అనే వ్యక్తి మృతిచెందిన విషయం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై గత వారం గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో మృతుడు సింగయ్య భార్య లూర్థుమేరీ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు బీ.ఎన్.ఎస్.లోని సెక్షన్ 106 (1) కింద కేసు నమోదు చేశారు. అయితే... తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఫుటేజీలలో.. జగన్ వాహనం కిందే పడి సింగయ్య మృతిచెందినట్లు వెల్లడవుతోందని అంటున్నారు! దీంతో... పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చారు.
ఇందులో భాగంగా... బీ.ఎన్.ఎస్.లోని 49, 105 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ సమయంలో... వాహనం నడిపిన జగన్ వెహికల్ డ్రైవర్ రమణారెడ్డిని ఈ కేసులో ఏ1గా చేర్చగా.. జగన్ ను ఏ2గా చేర్చారు. ఇక ఏ3గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరెడ్డి, ఏ4గా వైవీ సుబ్బారెడ్డిని చేర్చారు.
ఇదే సమయంలో మాజీ మంత్రులు పేర్ని నానిని ఏ5గా, విడదల రజనీని ఏ6గా, మరికొంతమందిని చేర్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ ఆదివారం రాత్రి మీడియాకు వివరించారు.
ఇందులో భాగంగా... ఈ నెల 18న మాజీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి రెంటపాళ్లలో విగ్రహావిష్కరణకు వెళ్లడానికి కాన్వాయ్ లోని 11 వాహనాలతో పాటు 3 వాహనాలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. అయితే... ఆ నిబంధనలకు విరుద్ధంగా ఆయన తాడేపల్లి నుంచే 50 వాహనాల్లో బయల్దేరారని ఎస్పీ తెలిపారు.
ఈ క్రమంలో కాన్వాయ్ నల్లపాడు స్టేషన్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ ఆంజనేయస్వామి విగ్రహం వద్దకు వచ్చిన సమయంలో.. సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొందని.. గాయపడిన సింగయ్యను రోడ్డుపక్కన పడుకోబెట్టినట్లు సమాచారం రావడంతో 108లో ఆసుపత్రికి తరలించామని అన్నారు.
అయితే.. అప్పటికే సింగయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారని అన్నారు. దీంతో... సింగయ్య భార్య లూర్థుమేరీ ఫిర్యాదు మేరకు 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పిన ఎస్పీ... దర్యాప్తులో భాగంగా ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీలు పరిశీలించడంతో పాటు ప్రత్యక్ష సాక్షులను విచారించినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే... మాజీ సీఎం జగన్ వాహనం కింద సింగయ్య పడిపోవడం, చక్రం అతనిపై ఎక్కుతున్నట్లుగా వీడియో ఆధారం దొరికిందని వెల్లడించారు. ఈ సందర్భంగా లభించిన ఆధారాలను సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి కేసుకు అదనంగా సెక్షన్లు చేర్చినట్లు ఎస్పీ వివరించారు.