Begin typing your search above and press return to search.

వైద్య రంగంలో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి AI ఆస్పత్రి ప్రారంభం

తాజాగా వైద్య రంగంలో చైనా ఒక అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఆధారిత ఆస్పత్రిని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

By:  Tupaki Desk   |   17 May 2025 12:00 AM IST
వైద్య రంగంలో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి AI ఆస్పత్రి  ప్రారంభం
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఊహకు అందని రీతిలో అభివృద్ధి చెందుతూ మానవ జీవితంలోని ప్రతి రంగాన్ని తనదైన ముద్రతో మార్చేస్తోంది. తాజాగా వైద్య రంగంలో చైనా ఒక అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఆధారిత ఆస్పత్రిని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఆస్పత్రి ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ రోగులు తప్ప మరెవరూ మనుషులు ఉండరు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా వర్చువల్‌గానే ఉంటారు. పూర్తిగా AI మయమైన ఈ ఆస్పత్రి పేరు "ఏజెంట్ హాస్పిటల్". వినడానికి వింతగా ఉన్నా, చైనా దీన్ని నిజం చేసి చూపించింది.

ఈ అత్యంత ప్రత్యేకమైన ఆస్పత్రిని చైనాలోని ప్రముఖ సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇటీవల దీనిని అధికారికంగా ప్రారంభించింది చైనా. ఈ వర్చువల్ ఆస్పత్రిలో 14 మంది AI డాక్టర్లు మరియు నలుగురు వర్చువల్ నర్సులు 24/7 సేవలు అందిస్తారు. ఈ AI రోబో డాక్టర్లు చాట్‌జీపీటీ 3.5 టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. అత్యవసర చికిత్స, శ్వాసకోశ వ్యాధులు, పిల్లల వైద్యం, కార్డియాలజీతో సహా మొత్తం 21 విభాగాల్లో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. సాధారణ వైద్యులతో పోల్చితే, ఈ AI డాక్టర్లు రోగులను పరీక్షించడంలో, చికిత్స అందించడంలో చాలా వేగంగా, కచ్చితత్వంతో పనిచేస్తాయి.

మనం సాధారణంగా వెళ్లే ఆస్పత్రులలో గంటలు లేదా రోజులు పట్టే వైద్య ప్రక్రియలు ఈ AI ఆస్పత్రిలో కేవలం నిమిషాల్లో పూర్తవుతాయి. రోజుకు ఏకంగా 3 వేల మంది రోగులకు వైద్య సేవలు అందించే సామర్థ్యం ఈ ఆస్పత్రికి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ AI ఆస్పత్రి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ AI రోబో డాక్టర్లు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (USMLE)లో 93.06శాతం స్కోర్ సాధించడం విశేషం. అంతేకాకుండా ఈ AI డాక్టర్లు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను, డేటాను స్వయంగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయి.

ఈ ఏజెంట్ హాస్పిటల్ కేవలం రోగులకు వైద్యం, సంరక్షణ అందించడమే కాకుండా భవిష్యత్తులో వైద్యులు కాబోయే విద్యార్థులకు పాఠాలు కూడా చెబుతుంది. వైద్య విద్యలో ఒక విప్లవాత్మక మార్పుకు ఈ ఆస్పత్రి వేదిక కానుంది. వైద్య విద్యార్థులు అత్యంత వాస్తవికమైన వాతావరణంలో శిక్షణ పొందవచ్చు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి AI ఆస్పత్రులు మరిన్ని ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఇది వైద్య రంగంలో ఒక నూతన శకానికి నాంది పలికినట్లుగా భావించవచ్చు.