మొబైల్ వాడొద్దన్నందుకు భర్తపై కత్తితో దాడి.. చోరీ సొత్తు అప్పగింత
సెల్‌ఫోన్ ఎక్కువగా చూడొద్దని భర్త మందలించడంతో ఆగ్రహించిన భార్య అతడిపై కత్తితో దాడి చేసిన ఘటన విజయపుర జిల్లా హాలకుంటె నగరంలో చోటుచేసుకుంది.
By: Tupaki Desk | 29 April 2025 9:29 PM ISTసెల్‌ఫోన్ ఎక్కువగా చూడొద్దని భర్త మందలించడంతో ఆగ్రహించిన భార్య అతడిపై కత్తితో దాడి చేసిన ఘటన విజయపుర జిల్లా హాలకుంటె నగరంలో చోటుచేసుకుంది. మరోవైపు, ఆటోలో మరచిపోయిన నగలను రాయచూరు పోలీసులు స్వాధీనం చేసుకుని సొంతదారులకు అప్పగించారు.
- భర్తపై కత్తితో భార్య దాడి
హాలకుంటె గ్రామంలో నివాసముంటున్న అజిత్ రాథోడ్, తేజు రాథోడ్ దంపతుల మధ్య మొబైల్ వాడకం చిచ్చుపెట్టింది. తేజు రాథోడ్ నిత్యం సెల్‌ఫోన్‌లో మునిగితేలేది. దీనిపై భర్త అజిత్ మందలించడంతో ఆమె మనసులో కోపం పెంచుకుంది. ఆదివారం తెల్లవారుజామున దాదాపు 3 గంటల సమయంలో భర్త గాఢ నిద్రలో ఉన్నప్పుడు, తేజు రాథోడ్ అతడి మెడ భాగంలో కత్తితో దాడి చేసింది. అజిత్ కేకలు విన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని బీఎల్‌డీఈ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆదర్శనగర్ పోలీసులు తేజు రాథోడ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
-ఆటోలో మరచిపోయిన నగలు రికవరీ
రాయచూరు రూరల్ పరిధిలో ఆటోలో మరచిపోయిన బంగారు, వెండి నగలను పోలీసులు రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. శక్తినగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 22న బస్టాండ్ నుంచి తీన్‌కందిల్ వరకు ఆటోలో ప్రయాణించింది. ఈ క్రమంలో ఆమె తన బంగారు నగలున్న బ్యాగును ఆటోలో మరచిపోయింది. దీంతో బాధితురాలు సదర బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి ఆటోను గుర్తించారు. ఆటోలో లభ్యమైన సుమారు రూ. 2 లక్షల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.
రాయచూరు ఎస్పీ సమక్షంలో ఆ సొత్తును తిరిగి బాధితురాలి లక్ష్మీకి అప్పగించారు. నగలు అప్పగించే కార్యక్రమంలో డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, ఎస్‌ఐ నరమమ్మ పాల్గొన్నారు. పోలీసుల పనితీరును బాధితురాలు అభినందించింది.