'ఐలవ్ గుడివాడ'.. అయినా వెనిగండ్ల రెడ్ జోన్.. రీజనేంటి ..!
ఈ సమయంలోనే ఆయన ప్రజల సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
By: Tupaki Desk | 24 Jun 2025 12:30 PM ISTమన ఇంటితో పాటు మన పరిసరాలకు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న స్ఫూర్తితో గుడివాడ ఎంఎల్ఎ వెనిగండ్ల రాము 'ఐ లవ్ గుడివాడ' పేరుతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రతి రోజూ ఆయన గుడివాడలోని పలు కాలనీలో పర్యటించి ప్రజలకు పరిసరాల శుబ్రత అవగాహన కల్పించారు. ఐ లవ్ గుడివాడ ప్రాజెక్ట్ ద్వారా ఆయన ఉదయం 5 గంటలకే ప్రజల మధ్యకు వస్తున్నారు. అవగాహన లేమీతో రోడ్లపై చెత్త వేయవద్దని. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా చెబుతున్నారు.
ఈ సమయంలోనే ఆయన ప్రజల సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, గుడివాడలో రహదారులను వెడల్పు చేయించారు. ప్రధానంగా కీలకమైన గుడివాడ ప్రధాన మార్గాన్ని కూడా విస్తరించే పనులు వడివడిగా సాగుతున్నాయి. ఇలా.. ప్రజలకు చేరువైన ఎమ్మెల్యేకి సహజంగానే ప్రజలనుంచి మంచి మార్కులు పడాలి. పడతాయి కూడా. కానీ.. తాజాగా వచ్చిన రెండు సర్వేల్లో వెనిగండ్ల రాముకు ఇబ్బందికర పరిస్థితివచ్చింది.
కేకే సర్వే, రైజ్ సంస్థ సర్వేల్లో గుడివాడ నియోజకవర్గం రెడ్ జోన్‌లో ఉండడం వెనిగండ్లతోపాటు.. పార్టీ నాయకులను ఆయన అనుచరులను కూడా విస్మయానికి గురి చేసింది. ఇంత చేస్తున్నా.. నియోజకవర్గం లో ఎందుకు ఇలాంటి రిజల్ట్ వచ్చిందన్నది వారిని ఇబ్బంది పెడుతోంది. సర్వే సంస్థలు తప్పు చేశాయా? లేక.. తమ పనితీరే మార్చుకోవాల్సిన అవసరం ఉందా? అనే కోణంలో చర్చ సాగుతోంది. ఇక, ప్రజల నాడిని డీప్‌గా చూస్తే.. ఎందుకు ఇలా జరుగుతోందన్నది తెలుస్తోంది.
వెనిగండ్ల రాము పనితీరుపై సంతృప్తితోనే ఉన్నారు. కానీ, పింఛన్లలో కోత పెట్టడం.. తల్లికి వందనం పథ కాన్ని సరిగా అమలు చేయకపోవడం వంటివి ఈ సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో తేలింది. ఇది ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంది. నిజానికి వైసీపీ హయాంలో కంటే ఇప్పుడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పైగా.. రహదారుల నిర్మాణం సహా.. తాగు నీటి వసతులను కూడా కల్పిస్తున్నారు. అయితే. సర్కారు నుంచి సంక్షేమం అందే విషయంలోనే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అదే ఎమ్మెల్యే మెడకు ఉచ్చుగా మారింది.