140 రోజుల్లో 6 ఖండాలు చుట్టిన యంగ్ పైలెట్ అరెస్ట్.. కారణం ఇదే!
చాలామందికి ప్రపంచ యాత్ర చేయాలని.. దేశాలన్నీ చుట్టేయాలని.. ఖండాలన్నీ కలతిరిగేయాలని కోరిక ఉంటుంది.
By: Tupaki Desk | 8 July 2025 6:00 PM ISTచాలామందికి ప్రపంచ యాత్ర చేయాలని.. దేశాలన్నీ చుట్టేయాలని.. ఖండాలన్నీ కలతిరిగేయాలని కోరిక ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ యంగ్ పైలెట్ కూడా ఒంటరిగా 7 ఖండాలు చుట్టి రావాలని భావించాడు. ఈ క్రమంలో ఇప్పటికే 140 రోజులుగా ఆరు ఖండాలు చుట్టేశాడు. అయితే... తాజాగా చిలీ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.
అవును... అమెరికాకు చెందిన 19 ఏళ్ల పైలట్ అనుమతి లేకుండా.. ఏడు ఖండాలు చుట్టేయడానికి ప్రయత్నించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ పర్యటన వెనుక గొప్ప ఉద్దేశ్యమే ఉన్నప్పటికీ... పలు జాతీయ, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా అంటార్కిటికా లో దిగే ప్రయత్నం చేసినప్పుడు అదుపులోకి తీసుకున్నారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం... అమెరికాకు చెందిన ఈథన్ గువ్ అనే పైలట్ ఏడు ఖండాలను చుట్టివేయాలనే ఆలోచనతో సెస్నా-182 విమానంతో బయలుదేరాడు. అయితే... ఈ పర్యటనకు సంబంధించి అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తన విమాన ప్రణాళికలను మార్చివేశాడు. ఈ క్రమంలో140 రోజులుగా ప్రయానిస్తూ ఇప్పటికే ఆరు ఖండాల మీదుగా ప్రయానించాడు.
ఈ క్రమంలో... పలు జాతీయ, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించాడు. అయితే.. తాజాగా అంటార్కిటికాలోని ఓ ప్రాంతంలో ల్యాండ్ అయ్యాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన చిలీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... అతడి వల్ల అంటార్కిటికా, మగల్లన్స్ ప్రాంతాలలో వాయురవాణా భద్రతకు అంతరాయం కలిగినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మగల్లనెస్, చిలీ అంటార్కిటికా ప్రాంతీయ ప్రాసిక్యూటర్ క్రిస్టియన్ క్రిసోస్టో రిఫో స్పందిస్తూ... నిందితుడు ఏరోనాటికల్ అథారిటీకి తప్పుడు సమాచారం అందించాడని ఆరోపించారు. పుంటా అరీనాస్ నగరం మీదుగా తాను ప్రయాణించబోతున్నట్లు సూచించే విమాన ప్రణాళికను సమర్పించి.. అతను ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి అనుమతి లేకుండా అంటార్కిటికా వైపు కొనసాగాడని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన పైలెట్ తరుపు న్యాయవాది... సదరు పైలట్ ఒంటరిగా ఏడు ఖండాలకు ప్రయాణించి 1 మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించి వాటిని క్యాన్సర్ బాధితులకు ఇవ్వాలనే ఆతోచనతో ఈ ప్రయాణం మొదలుపెట్టారని పేర్కొన్నారు.