వాటా సేల్ కు చైనా సంస్థలు.. సిద్ధమవుతున్న భారత దిగ్గజాలు
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే.. మారే కాలం ఊహించని మార్పుల్ని తెర మీదకు తీసుకొస్తుంటుంది.
By: Tupaki Desk | 30 April 2025 2:00 AM ISTకాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే.. మారే కాలం ఊహించని మార్పుల్ని తెర మీదకు తీసుకొస్తుంటుంది. ఇప్పుడు లాంటి సీన్ ఒకటి కార్పొరేట్ ప్రపంచంలోచోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ దెబ్బకు చైనా కంపెనీలు విలవిలలాడుతున్నాయి. కొన్ని సంస్థలు భారత్ వైపు చూస్తున్నాయి. చైనాపై అమెరికా విధించిన భారీ టారిఫ్ వాతల నేపథ్యంలోకొత్త వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇందులో భాగంగా కొన్ని చైనా కంపెనీలు తమ వాటాల్ని అమ్మేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా చైనా సంస్థ హయర్ ను చెప్పాలి. ఫ్రిజ్ లతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఉత్పత్తి చేసే ఈ సంస్థ హయర్ ఇండియాలో వాటాను అమ్మేందుకు సిద్ధమవుతోంది. దీని వాటాను కొనుగోలు చేయటానికి దిగ్గజ సంస్థలైన రిలయన్స్.. ఎయిర్ టెల్ సిద్ధమవుతోంది. మరో చైనా కంపెనీ షాంఘై హైలీ వాటాను కొనుగోలు చేసేందుకు టాటాలు రెఢీ అవుతున్నారు.
వినియోగదారు ఎలక్ట్రానిక్స్.. అప్లయెన్సెస్ తయారీ వ్యాపారాన్ని మరింత బలోపేతం అయ్యేందుకు.. అమెరికా టారిఫ్ సుంకాల నుంచి తప్పించుకోవటానికి వీలుగా తమ వాటాల్ని అమ్మేందుకు సిద్ధమవుతున్నాయి. హయర్ విషయానికి వస్తే.. సదరు సంస్థ తన హయర్ ఇండియాలో 25-51 శాతం వాటాను అమ్మాలని భావిస్తోంది. ఈ కంపెనీ వాటాల్ని సొంతం చేసుకోవటానికి రిలయన్స్ తో పాటు సునీల్ మిత్తల్ కు చెందిన భారతీ గ్రూప్ పోటీ పడుతోంది.
ఇదిలా ఉంటే.. టాటాలకు చెందిన ఓల్టాస్ తో కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేసేందుకు షాంఘై హైలీ సిద్ధమవుతోంది. భారత్ లో తాను మైనార్టీ వాటాకు సైతం ఓకే చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారత్ వాటా పెద్దది కావటం.. భారత్ నుంచి వస్తువుల్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చూస్తే.. అమెరికా టారిఫ్ కత్తి నుంచి బయటపడొచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని చైనా కంపెనీలు భారత కంపెనీలతో జత కట్టటమే కాదు.. భారత్ లోని తమ కంపెనీల్లో మెజార్టీ వాటాను భారత కంపెనీలకు దఖలు పర్చటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.