Begin typing your search above and press return to search.

80 దేశాలు..750 స్థావరాలు..పశ్చిమాసియా..అమెరికా ప్రధాన సైనిక అడ్డా

ఎక్కడో ఉన్న ఇరాక్, లిబియా, ఇరాన్ పై అమెరికా దాడులకు దిగుతుంది.. అసలు ఈ ప్రపంచంలో ఏ ఘర్షణ జరిగినా తాను ఉన్నానంటూ వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మరీ చోద్యంగా.. శాంతి దూతగా ప్రపంచానికి కనిపించాలని తాపత్రయ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 1:10 PM IST
80 దేశాలు..750 స్థావరాలు..పశ్చిమాసియా..అమెరికా ప్రధాన సైనిక అడ్డా
X

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న అని ఎందుకు అంటారో తెలుసా..? 35 ఏళ్లుగా ఏకైక సూపర్ పవర్ గా ఎందుకు నిలుస్తున్నదో తెలుసా? భూమ్మీద ఏమూల ఏం జరిగినా అమెరికా వేలు ఎందుకు పెడుతుందో తెలుసా? అసలు ప్రపంచంలో ఏ దేశానికీ లేనంతగా ఆ దేశానికి విదేశాల్లో ఎన్ని స్థావరాలు ఉన్నాయో తెలుసా? 80 ఏళ్ల కిందట తాను అణు బాంబు వేసి సర్వనాశనం చేసిన దేశంలోనే ఇప్పుడు అత్యధికంగా సైనిక స్థావరాలు ఏర్పాటు చేయగలగడం అమెరికాకు మాత్రమే సాధ్యమైందని తెలుసా? ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కాలు పెట్టడంతో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి.

ఎక్కడో ఉన్న ఇరాక్, లిబియా, ఇరాన్ పై అమెరికా దాడులకు దిగుతుంది.. అసలు ఈ ప్రపంచంలో ఏ ఘర్షణ జరిగినా తాను ఉన్నానంటూ వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మరీ చోద్యంగా.. శాంతి దూతగా ప్రపంచానికి కనిపించాలని తాపత్రయ పడుతున్నారు. ఇక భూమ్మీద నలుమూలలా ఆ దేశానికి సైనిక స్థావరాలు ఉన్నాయంటే నమ్మాల్సిందే మరి.

గత ఏడాది మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి కారణం.. అమెరికా సైనిక స్థావరాన్ని ఆ దేశానికి చెందిన ప్రాంతంలో ఏర్పాటు చేయనీయకపోవడమే అని కథనాలు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే.. అమెరికాకు నాలుగేళ్ల కిందటే 80 దేశాల్లో 750 సైనిక స్థావరాలు ఉన్నాయట.

రెండో ప్రపంచ యుద్ధంలో భీకరంగా తలపడిన జపాన్ లోనే 120, జర్మనీలో 119 అమెరికా స్థావరాలు ఉండడం గమనార్హం. ఉత్తర కొరియా నుంచి ఎప్పుడూ ముప్పు ఎదుర్కొనే దక్షిణ కొరియాలో 73 అమెరికా స్థావరాలు ఉన్నాయని కథనం. ఇక 1990ల మొదట్లో తలెత్తిన గల్ఫ్ యుద్ధంలో అమెరికా కాలు, వేళ్లు అన్నీ పెట్టింది. సద్దాం హుస్సేన్ ను దింపేశాక ఇరాక్ లోనూ స్థావరం ఏర్పాటు చేసుకుంది. ఎప్పుడూ యుద్ధ వాతావరణంలో ఉండే పశ్చిమాసియాలో అమెరికాకు 40 వేల మంది సైనికులు ఉండడం గమనార్హం. వీరంతా యుద్ధ నౌకల్లో ఎక్కువగా ఉన్నారు. 19 స్థావరాల్లో మిగిలినవారు ఉన్నారు.

ఇజ్రాయెల్ తో పాటు బహ్రెయిన్, ఈజిప్ట్, జోర్డాన్, కువైత్, ఖతర్, సౌదీ అరేబియా, సిరియా, యూఏఈల్లో అమెరికాకు 8 శాశ్వత స్థావరాలు ఉన్నాయి.1958లో లెబనాన్ లో కాలుమోపిన అమెరికా తొలిసారిగా పశ్చిమాసియాలో పాగా వేసింది.ఖతర్ రాజధాని దోహా శివారు ఏడారిలో 36 ఎకరాల్లో అల్ ఉదీద్ సైనిక స్థావరం పశ్చిమాసియాలోనే పెద్దది. ఇందులో 10 వేల మంది సైనికులు ఉన్నారు.