వైట్ హౌస్ ఆవరణలో ఇరాన్ జెండాలు... ఏమి జరుగుతుంది?
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Jun 2025 2:00 PM ISTఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:40 కి దాడులు మొదలుపెట్టి 7:05కి ముగించింది. ఈ 25 నిమిషాల్లో ఇరాన్ లోని మూడు అణుస్థావరాలే లక్ష్యంగా బంకర్ బ్లస్టర్ బాంబులు, తోమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది.
అలా పని పూర్తి చేసిన అనంతరం అమెరికా యుద్ధ విమానాలు తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. 'ఆపరేషన్ మిడ్ నైట్ హామర్' పేరుతో ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహాన్ అణుశుద్ధి కేంద్రాలపై దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించుకుంది. ఈ నేపథ్యలో అగ్రరాజ్యంలోని పలు నగరాల్లో యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరమయ్యాయి.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ ఉద్రిక్తతల నడుమ.. అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా ప్రధాన నగరాల్లో ఇరాన్ మద్దతు ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో భాగంగా నేరుగా అమెరికా అధ్యక్ష భవనం "వైట్ హౌస్" ఆవరణలోనే ట్రంప్ వ్యతిరేక నినాదాలతో ప్రదర్శన జరగడం గమనార్హం.
ఈ సందర్భంగా... 'ఇరాన్ పై యుద్ధం వద్దు'.. 'ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వడం ఆపండి'.. 'గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే' అంటూ అధ్యక్షుడు ట్రంప్ ను ఉద్దేశించి పలువురు ఇరానియన్లు నినాదాలు చేశారు. ఈ విధంగా సాగుతున్న యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అమెరికాలోని పలు ప్రధాన నగరాలు మారుమ్రోగుతున్నాయి.
ఈ నిరసనల నేపథ్యంలో... అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. వాస్తవానికి ఇరాన్ పై అమెరికా దాడుల అనంతరం పలు సున్నితమైన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
కాగా... ఇరాన్ పై అమెరికా దాడుల అనంతరం ట్రంప్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... శాటిలైట్ చిత్రాలను గమనించినట్లయితే.. ఇరాన్ లోని అన్ని అణుకేంద్రాలకు తీవ్ర నష్టం జరిగినట్లు అర్థమవుతోందని అన్నారు. ఈ సమయంలో... 'తుడిచిపెట్టుకుపోయాయ్' అని అనడం సరైన పదమేమో అని రాసుకొచ్చారు.