Begin typing your search above and press return to search.

ఆ రూ.23.3 లక్షల వీసాపై విజయసాయిరెడ్డి ఆందోళన ఇదే!

ఈ సమయంలో యూఏఈ కూడా అలాంటి వీసాను తీసుకొచ్చింది. దీనిపై విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 July 2025 10:00 PM IST
ఆ రూ.23.3 లక్షల వీసాపై విజయసాయిరెడ్డి ఆందోళన ఇదే!
X

ఇటీవల గోల్డెన్ వీసా అనే అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ట్రంప్ గోల్డ్ కార్డ్' వీసా ను ప్రకటించారు. దీని ప్రకారం... ప్రభుత్వానికి ఐదు మిలియన్ డాలర్లు చెల్లించిన తర్వాత అమెరికా పౌరసత్వం పొందే మార్గాన్ని ఇది అందిస్తుంది. ఈ సమయంలో యూఏఈ కూడా అలాంటి వీసాను తీసుకొచ్చింది. దీనిపై విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అవును... ఏప్రిల్ లో ట్రంప్ తొలిసారిగా గోల్డ్ కార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. 5 మిలియన్ డాలర్లు చెల్లించగలిగితే నేరుగా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. ఇదే తరహాలో తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గతంలోలా కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండానే తమ దేశ పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తోంది.

ఇందులో భాగంగా... కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం లేకుండా కేవలం రూ.23.3 లక్షలు కడితే భారత్, బంగ్లాదేశ్ పౌరులకు గోల్డెన్ వీసా ఇస్తామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. దీనితో వీరు అరబ్ పౌరుల్లా అక్కడ శాశ్వతంగా నివసించడానికి, పని మనుషుల్ని నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో... ఎలాంటి పెట్టుబడి లేకుండా, కేవలం రూ.23.3 లక్షల రుసుముతో యూఏఈ అందించే కొత్త గోల్డెన్ వీసా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నిజమైన ముప్పుగా పరిణమిస్తుందని సాయిరెడ్డి ఆరోపించారు. ఇది నైపుణ్యం కలిగిన వలసలను వేగవంతం చేసే ప్రమాదం ఉందని, సన్ రైజ్ సెక్టార్స్ లో ప్రతిభ శూన్యతను సృష్టించే ప్రమాదం ఉందని అన్నారు.

ఇదే సమయంలో... మన తెలివైన మనస్సులు భారతదేశంలో నిర్మించాలని ఎంచుకునేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని సూచిస్తూ... ఏ భారతీయుడు కూడా ఇష్టానుసారంగా మన దేశాన్ని వదిలి వెళ్లాలనుకోడని రాసుకొచ్చారు.

కాగా.. ఇప్పటివరకు భారత్‌ నుంచి దుబాయ్‌ గోల్డెన్ వీసా పొందాలంటే రియల్ ఎస్టేట్ లో కనీసం రూ.4.66 కోట్లు లేదా వ్యాపారంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటివి చేయాలి! అయితే... కొత్తగా ప్రవేశపెట్టిన వీసా విధానం కింద.. రూ.23.30 లక్షలు ఫీజు చెల్లించడం ద్వారా జీవితకాలం చెల్లుబాటయ్యే గోల్డెన్ వీసాను పొందొచ్చు! దీంతో.. మూడు నెలల్లో 5,000 మందికిపైగా భారతీయులు ఈ రకం వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు!