Begin typing your search above and press return to search.

జుట్లు విరబోసుకొని డ్యాన్స్.. అవాక్కైన ట్రంప్.. ఇదీ దీని సంప్రదాయం

ముఖ్యంగా ఆ స్వాగతంలో భాగంగా కొందరు బాలికలు జుట్టు విరబోసుకొని చేసిన నృత్యం ట్రంప్‌తో పాటు నెటిజన్లను కూడా ఆశ్చర్యపరిచింది

By:  Tupaki Desk   |   16 May 2025 1:02 PM IST
జుట్లు విరబోసుకొని డ్యాన్స్.. అవాక్కైన ట్రంప్.. ఇదీ దీని సంప్రదాయం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన సందర్భంగా ఆయనకు లభించిన ఓ ప్రత్యేక స్వాగతం ప్రస్తుతం నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆ స్వాగతంలో భాగంగా కొందరు బాలికలు జుట్టు విరబోసుకొని చేసిన నృత్యం ట్రంప్‌తో పాటు నెటిజన్లను కూడా ఆశ్చర్యపరిచింది. 'ఈ జుట్ల డ్యాన్స్ ఏందయ్యో.. అనలా అవాక్కైన ట్రంప్’ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సంప్రదాయం ఏంటి? దాని వెనుక కథ ఏంటి?

యూఏఈకి చేరుకున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలూ అధ్యక్ష భవనం ఖషర్ అల్-వాటన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగానే ట్రంప్‌కు అల్-అయ్యాలా (Al-Ayyala) అనే సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. ఈ నృత్యంలో కొందరు బాలికలు సంప్రదాయ దుస్తులు ధరించి, తమ పొడవాటి జుట్టును విరబోసుకొని, ప్రత్యేక సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా తలలు ఊపుతూ నృత్యం చేశారు.

ఈ దృశ్యం ట్రంప్‌ను కాస్త ఆశ్చర్యానికి గురిచేసినట్లు వీడియోల్లో కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలను చూసిన నెటిజన్లు కూడా ఈ వినూత్న స్వాగతంపై, ముఖ్యంగా ఆ జుట్టు ఊపుతూ చేసే నృత్యంపై ఆసక్తి కనబరుస్తున్నారు.

- అసలు ఏంటీ అల్-అయ్యాలా?

యునెస్కో ప్రకారం.., అల్-అయ్యాలా అనేది యూఏఈ - ఒమన్‌లలో చాలా ప్రాచుర్యం పొందిన ఒక సంప్రదాయ నృత్య రూపం. దీనిని సాధారణంగా ఉత్సవాలు, వివాహాలు వంటి ప్రత్యేక వేడుకల సమయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నృత్యంలో వయస్సు, లింగం, సామాజిక స్థితితో సంబంధం లేకుండా అందరూ పాల్గొనే అవకాశం ఉంటుంది. సంప్రదాయ దుస్తుల్లో లయబద్ధంగా కదులుతూ ముఖ్యంగా మహిళలు తమ పొడవాటి జుట్టును సంగీతానికి అనుగుణంగా విరబోసుకొని తలలు ఊపుతూ చేసే కదలికలు ఈ నృత్యంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

సామాజిక బేధాలు లేకుండా అందరినీ ఒకచోట చేర్చేదిగా, ఐక్యతకు ప్రతీకగా ఈ సంప్రదాయ నృత్యాన్ని భావిస్తారు. ట్రంప్ వంటి అంతర్జాతీయ నాయకుడికి స్వాగతం పలకడం ద్వారా తమ సంప్రదాయాన్ని, సంస్కృతిని చాటిచెప్పడంలో భాగంగానే దీనిని ప్రదర్శించి ఉంటారని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ అల్-అయ్యాలా నృత్యం ట్రంప్ పర్యటనలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.