Begin typing your search above and press return to search.

యూఎస్ లో కొత్త చట్టం... వీసా దరఖాస్తుదారులపై అదనపు భారం!

అవును... ట్రంప్ ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి తీసుకువచ్చిన "వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు" ఇటీవల చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 July 2025 10:41 PM IST
యూఎస్  లో కొత్త చట్టం... వీసా దరఖాస్తుదారులపై  అదనపు భారం!
X

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రపంచ దేశాలను ఇబ్బందిపెట్టే పలు నిర్ణయాలు ఉన్నాయి! ఈ సమయంలో తాజా సంచలనం "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు" తో ఆ దేశానికి వెళ్లాలనుకునేవారికి వీసా ధరఖాస్తుల విషయంలో అదనపు భారం పడనుందని తెలుస్తోంది.

అవును... ట్రంప్ ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి తీసుకువచ్చిన "వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు" ఇటీవల చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కొత్త చట్టం ద్వారా వీసా దరఖాస్తుదారులపై అదనపు భారం పడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాన్‌ ఇమిగ్రెంట్లకు కొత్తగా వీసా ఇంటిగ్రిటీ ఫీజును డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ తప్పనిసరి చేసిన పరిస్థితి.

దీంతో... నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా జారీ చేసే సమయంలో వీసా ఇంటిగ్రిటీ ఫీజు కింద 250 డాలర్లు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ ఫీజును పెంచే అధికారం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీకి కల్పించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి ఏటా దీన్ని పెంచే అవకాశం ఉందని ఇమిగ్రేషన్‌ సేవల సంస్థ ఫ్రాగోమెన్‌ నివేదిక వెల్లడించింది.

అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం కానీ, క్యాన్సిల్ చేయడం కానీ ఉండదని తెలిపింది. అయితే, కొన్ని పరిమితులకు లోబడి డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ మినహాయింపు ఇవ్వనుంది. ఇందులో భాగంగా... కొనసాగింపునకు లేదా స్టేటస్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకోకుండా ఐ-94 గడువు ముగిసే ఐదు రోజుల కంటే ముందు అమెరికాను వీడే వారికి ఇవ్వనుంది!

అదేవిధంగా... ఐ-94 గడువు కంటే ముందే చట్టపరంగా కొనసాగేవారికి, శాశ్వత నివాస అనుమతి లభించిన వారికి మాత్రమే వీసా ఇంటిగ్రిటీ ఫీజు రీఫండ్‌ అవకాశం ఉంటుందని నివేదిక తెలిపింది! లేకపోతే, ఆ మొత్తాన్ని యూఎస్ ట్రెజరీ జనరల్ ఫండ్‌ కు పంపబడుతుంది.

ఏది ఏమైనా... ఈ ట్రంప్ కొత్త బ్యూటీఫుల్ చట్టంతో అమెరికాకు చదువులు, ఉద్యోగం కోసం వచ్చే వారిపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులు, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్, టూరిస్టులు, ఎఫ్-1, హెచ్‌ 1బీ వీసాపై వచ్చే ఉద్యోగులకు ఆర్థికంగా కొంత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది.