Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ తో ట్రంప్ చీకటి ఒప్పందం?

ఈ ఒప్పందంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ప్రమేయం ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

By:  Tupaki Desk   |   16 May 2025 2:09 PM IST
పాకిస్తాన్ తో ట్రంప్ చీకటి ఒప్పందం?
X

పహల్గాంలో జరిగిన ఇటీవల ఉగ్రదాడి, ఆ దాడికి ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధం ఉన్న ఒక సంస్థకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య ఓ కీలక ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ప్రమేయం ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

-ట్రంప్ కుటుంబానికి వాటాలున్న అమెరికన్ సంస్థతో డీల్

అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్' , పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం నెల రోజుల క్రితమే ఏర్పాటు చేసిన క్రిప్టో కౌన్సిల్‌తో కుదిరిన ఈ ఒప్పందంపై అప్పట్లో పెద్దగా దృష్టి సారించలేదు. అయితే వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థలో డొనాల్డ్ ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60 శాతం వాటా కలిగి ఉన్నారని సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించిన 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' కూడా ఉన్నట్లు వార్తలు పేర్కొంటున్నాయి.

-ఆఘమేఘాల మీద క్రిప్టో కౌన్సిల్ కదలికలు

ఈ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ వేగంగా అడుగులు వేసింది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేలా, ఒప్పందం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను తమ సలహాదారుగా పాకిస్తాన్ ప్రభుత్వం నియమించింది.

-ఆసిమ్ మునీర్ ఘన స్వాగతం, రహస్య సమావేశం

ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన ఒక ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వయంగా స్వాగతం పలికారు. ఈ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు, ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న జాకరీ విట్కాఫ్ బృందం, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.

-పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ ప్రవేశం

ఈ ఒప్పందం ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్‌ల అభివృద్ధి, మరియు డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (DeFi) పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను కలిగి ఉంది. దీని ద్వారా పాకిస్తాన్‌లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణ, బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

- అనుమానాలకు తావిస్తున్న ఒప్పందం సమయం

అయితే, పహల్గాం ఉగ్రదాడి , ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ ఒప్పందంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఈ ఒప్పందం వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కానీ, ట్రంప్ కుటుంబం , వైట్ హౌస్ నుండి ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పహల్గాం దాడికి కొద్ది రోజుల ముందే ఈ ఒప్పందం జరగడం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్వయంగా అమెరికన్ బృందానికి స్వాగతం పలకడం, రహస్య సమావేశాలు నిర్వహించడం వంటి పరిణామాలు ఈ ఒప్పందంపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఈ "చీకటి ఒప్పందం" వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.