మోడీకి మంట పెడుతున్న ట్రంప్ సెల్ఫ్ గోల్!
అయితే.. ఈ కీలక సమయంలో ట్రంప్ అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేసేలా.. ప్రతిపక్షాలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చేలా వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 29 July 2025 10:56 AM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి.. అమెరికా అధ్యక్షుడు మిత్రుడు. ఇద్దరూ కూడా అనేక సందర్భాల్లో ఈ మాట చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మోడీ కూడా.. ట్రంప్ విజయం దక్కించుకో వాలని కోరుకున్నట్టు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పలు సందర్బాల్లో వ్యాఖ్యానించారు. అయితే.. మోడీకి ఇప్పుడు ఆ మిత్రుడే కంట్లో నలుసుగా మారారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో.. `ఆపరేషన్ సిందూర్` పై 16 గంటల సుదీర్ఘ చర్చ సాగుతోంది సోమవారం లోక్‌సభలో ప్రారంభమైన ఈ చర్చ.. వాయిదాల పర్వంతో ముందుకు సాగుతోంది.
మంగళవారం రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్.. అనంతర పరిణామాలపై చర్చ చేపట్టనున్నారు. ఈ సభలో కూడా 16 గంటల పాటు చర్చ సాగనుంది. అయితే.. ఈ కీలక సమయంలో ట్రంప్ అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేసేలా.. ప్రతిపక్షాలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చేలా వ్యాఖ్యానించారు. తానే లేక పోతే.. పాకిస్థాన్-భారత్ మధ్య ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉండేదని.. తానే ఇద్దరినీ నిలువరించానని.. చెప్పారు. అంతేకాదు.. వాణిజ్య ఒప్పందాలు పునః సమీక్షించడంతోపాటు.. సుంకాలు మరింత బాదుతానని చెప్పడంతోనే ఇరు దేశాలు వెనక్కి తగ్గాయన్నారు.
వాస్తవానికి ఈ వ్యాఖ్యలు.. ఇప్పుడు కొత్తగా చేయకపోయినా.. గత నుంచి కూడా ట్రంప్ ఇదే చెబుతున్నారు. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి కాల్పుల విరమణను భారత్-పాక్ ప్రకటించడానికి ముందే.. ట్రంప్ ప్రకటించారు. ఇది పెను దుమారంగా మారింది. అందుకే.. మోడీ సర్కారుపై విపక్షాలు దుమ్మెత్తిపోసి.. చర్చకు పట్టుబట్టడంతో.. ఇప్పుడు పార్లమెంటు ఉభయ సభలు కూడా.. గతంలో ఎన్నడూ లేని విధంగా 16 గంటల చొప్పున కేటాయించి.. చర్చ చేపట్టాయి. ఇలాంటి కీలక సమయంలోనూ.. ట్రంప్ మరోసారి ఈ వాదన వినిపించడంతో ప్రతిపక్షాలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్టు అయింది.
ఒకవైపు.. ఆపరేషన్ సిందూర్‌ను సమర్థించుకునేందుకు.. పాక్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టేందుకు తాము ప్రయత్నించామని ప్రభుత్వం చెబుతుంటే.. అసలు దీనిలో ట్రంప్ ప్రమేయం ఏంటని.. దీనిపై చర్చకు రావాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే మరోసారి ట్రంప్ తన ప్రమేయంతోనే.. యుద్ధంవిరమించారని వ్యాఖ్యానించారు. మరి ఆయన భారత్‌లో చర్చ జరుగుతోందని తెలిసి వ్యాఖ్యానించారో.. లేక సెల్ప్ గోల్ చేసుకునే ప్రయత్నమో ఏదైనా కానీ.. ప్రధాని మోడీకి మాత్రం ఇబ్బందిగానే మారిందని చెప్పాలి.