Begin typing your search above and press return to search.

తిరుమ‌లలో మ‌రో వివాదం: ఏరేస్తున్నా.. దొరుకుతున్నారు!

ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్య మతస్తులు ఉన్న విభాగాలలో ప్రక్షాళన చేశారు.

By:  Tupaki Desk   |   8 July 2025 10:44 PM IST
తిరుమ‌లలో మ‌రో వివాదం: ఏరేస్తున్నా.. దొరుకుతున్నారు!
X

పవిత్రమైన తిరుమల కొండపై ఎలాంటి అపచారాలు, అన్యమత ప్రచారాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అనేక పటిష్టమైన చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలో గతంలో అంటే ఇప్పుడు భద్రతను పెంచారు. అదేవిధంగా తనిఖీలను కూడా చేయిస్తున్నారు. నిరంతరం తిరుమలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

వైసిపి హయాంలో తిరుమల కొండపైనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు వారు ఆందోళనలకు కూడా దిగారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతను కాపాడేందుకు పెద్దపేట వేసింది. ఈ క్రమంలో అనేక సంచలన‌ నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్య మతస్తులు ఉన్న విభాగాలలో ప్రక్షాళన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కీలక విభాగాలలో హిందువులు మాత్రమే ఉద్యోగాలు చేసేలా ఆయన నిర్ణయం తీసుకుని అమలు చేశారు. దీనిపై విమర్శలు వచ్చినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా అడుగులు వేశారు. దీంతో 50 శాతానికి పైగా అన్యమతస్తులు తిరుమల తిరుపతి విభాగానికి చెందిన ఇతర సంస్థల్లోకి బదిలీ అయ్యారు. దీంతో గత కొన్నాళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా తిరుమల పవిత్రంగా ఉందని భక్తులు అభిప్రాయపడుతూ వచ్చారు.

ఇటువంటి కీలక సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆలయ అదనపు కార్య నిర్వహణ అధికారి ఏ రాజశేఖర్ బాబు తాజాగా క్రిస్టియన్ మతస్తులతో కలిసి చర్చికి వెళ్లి ప్రార్థనలో పాల్గొన్నట్టుగా వీడియోలు వెలుగు చూసాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయ‌న‌.. దాదాపు 15 ఏళ్లుగా తిరుమలలో పనిచేస్తున్నారు. కానీ ఆయన క్రిస్టియన్ మతాన్ని అనుసరించటం, ప్రార్ధనలో పాల్గొనడం చేస్తున్నట్టు తాజాగా వెలుగు చూస్తుంది .చిత్తూరు జిల్లా పుత్తూరులోని చర్చిలో జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నట్టు వీడియోలు ఫోటోలు వెలుగు చూడడంతో తిరుమల అధికారులు అప్రమత్తమయ్యారు.

విజిలెన్స్ విభాగం అధికారులతో దర్యాప్తు చేయించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెంటనే రాజశేఖర్ బాబును సస్పెండ్ చేశారు. అయితే ఈ వ్యవహారం అప్పటికే రాజకీయంగా విమర్శలకు దారితీసింది. తాము ముందు నుంచి చెబుతున్నామని, అయినా అధికారులు పట్టించుకోవడంలేదని వైసిపి నాయకులు విమర్శలు గుప్పించారు. రాజశేఖర బాబును సస్పెండ్ చేయడం కాదని ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుమల లోని అలిపిరి ముందు ధర్నా చేపట్టారు. ఏదేమైనా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే మరోవైపు ఇలా కొందరు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది.