Begin typing your search above and press return to search.

2 మార్కులు తక్కువ వేసిందని టీచర్ పై విద్యార్థి దాడి

గురువు అంటే విద్యార్థికి మార్గదర్శకుడు, జ్ఞానప్రదాత. తల్లిదండ్రి తర్వాత అత్యున్నత స్థానం గురువుకే చెందుతుంది.

By:  A.N.Kumar   |   14 Aug 2025 8:15 AM IST
2 మార్కులు తక్కువ వేసిందని టీచర్ పై విద్యార్థి దాడి
X

గురువు అంటే విద్యార్థికి మార్గదర్శకుడు, జ్ఞానప్రదాత. తల్లిదండ్రి తర్వాత అత్యున్నత స్థానం గురువుకే చెందుతుంది. కానీ కాలం మారుతున్నకొద్దీ, గురువుల పట్ల గౌరవం తగ్గిపోతూ, మర్యాదలేకుండా ప్రవర్తించే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా థాయిలాండ్‌లో చోటుచేసుకున్న ఘటన దీనికి నిదర్శనం. కేవలం రెండు మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థి తన లెక్కల టీచర్‌పై దారుణంగా దాడి చేయడం అక్కడ కలకలం రేపింది.

ఉతాయ్ థానీ ప్రావిన్స్‌కు చెందిన ఆర్టీ అనే మహిళ స్థానిక పాఠశాలలో లెక్కల టీచర్‌గా పనిచేస్తోంది. ఆగస్టు 5న మిడ్-టర్మ్ గణిత పరీక్ష ఫలితాలు ప్రకటించిన సందర్భంగా ఒక విద్యార్థికి 20 మార్కుల్లో 18 మార్కులు వచ్చాయి. రెండు మార్కులు తక్కువగా వచ్చినందుకు అతను అసంతృప్తి వ్యక్తం చేశాడు. కావాలనే తక్కువ మార్కులు ఇచ్చారని ఆరోపణలు చేస్తూ, క్లాస్‌రూమ్‌లోనే ఆర్టీతో వాగ్వాదం ప్రారంభించాడు.

వివాదం చెలరేగిన కొద్దిసేపటికే ఆ విద్యార్థి కోపంతో రెచ్చిపోయి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పక్క తరగతి గదిలో ఉన్న ఓ మగ టీచర్ వచ్చి మధ్యలో జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత విషమించేది. ఈ దాడిలో ఆర్టీ కళ్లకు, తలకు, రిబ్స్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.

- సీసీటీవీ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటన క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆర్టీ ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ, “నా మీద దాడి చేసిన ఆ విద్యార్థిని వదిలిపెట్టను. చట్టపరంగా పోరాడతాను. అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తాను” అని వ్యాఖ్యానించింది.

వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువుకు గౌరవం ఇవ్వని, మర్యాదలేని విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.

ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. విద్య అనేది కేవలం మార్కుల కోసం కాదు, విలువల కోసం కూడా కావాలని. గురువుపై చేయి ఎత్తే సంస్కృతి సమాజానికి ప్రమాదకర సంకేతమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.