Begin typing your search above and press return to search.

టికెట్ల ధరల రచ్చ.. జగన్‌కు ఎలివేషన్ కరెక్టేనా?

జగన్ రేట్లు తగ్గిస్తే గగ్గోలు పెట్టారని.. ఇప్పుడు ఆల్రెడీ టికెట్ల ధరలు పెంచి, వాటి మీద అదనపు రేట్లు వడ్డిస్తే బాగుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

By:  Garuda Media   |   13 Aug 2025 9:51 AM IST
టికెట్ల ధరల రచ్చ.. జగన్‌కు ఎలివేషన్ కరెక్టేనా?
X

సౌత్ ఇండియాలో మరే రాష్ట్రాల్లోనూ లేనంత అధిక టికెట్ ధరలు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే. ముఖ్యంగా తెలంగాణలో అయితే మరీ ఎక్కువ. తమిళనాడు, కేరళతో పోలిస్తే పోలిస్తే ఏపీలోనూ రేట్లు అధికమే. కర్ణాటకలో మల్టీప్లెక్సుల్లో రేట్లు ఎక్కువే అయినా.. ఈ మధ్య సిద్ధరామయ్య ప్రభుత్వం టికెట్ రేట్ 200కు మించకూడదన్న ప్రతిపాదన తెచ్చింది. అది అమలైతే తెలుగు రాష్ట్రాల రేట్లే అధికం అవుతాయి. అయినా సరే.. పెద్ద సినిమాలకు తొలి వారం పది రోజుల్లో వాటి మీద ఇంకా రేట్లు పెంచుకునేందుకు అనుమతులు అడుగుతున్నారు.

ఏపీలో ఈజీగా పర్మిషన్లు వచ్చేస్తున్నాయి. ఇది ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అందులోనూ డబ్బింగ్ సినిమాలైన వార్-2, కూలీ చిత్రాలకు కూడా రేట్లు పెంచుతున్నారనే వార్తలతో సోషల్ మీడియా జనాలు యుద్ధం ప్రకటించారు. టాలీవుడ్‌కు వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేశారు. ఈ సందర్భంగా ఒక వర్గం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇవ్వడం గమనార్హం.

జగన్ రేట్లు తగ్గిస్తే గగ్గోలు పెట్టారని.. ఇప్పుడు ఆల్రెడీ టికెట్ల ధరలు పెంచి, వాటి మీద అదనపు రేట్లు వడ్డిస్తే బాగుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐతే ఉన్న రేట్ల మీద అదనపు భారం మోపడం కచ్చితంగా తప్పే. అది ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పిస్తున్న మాట వాస్తవం. దీన్ని దోపిడీగానే బావించాలి.

కానీ అంతమాత్రాన జగన్ చేసింది కరెక్ట్ అయిపోదు. ఆయన ప్రేక్షకులకు మేలు చేయాలనేమీ రేట్లు తగ్గించలేదు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ ‌సినిమా ‘వకీల్ సాబ్’ను ను ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో తుప్పుపట్టిన జీవోను బయటికి తీసి మరీ 5, 10 రూపాయలకు టికెట్లు అమ్మించారు. అర్లీ మార్నింగ్ షోలు లేకుండా చేశారు. నిబంధనల పేరు చెప్పి హఠాత్తుగా థియేటర్లను టార్గెట్ చేయించి షోలు పడకుండా చేయించారు.

ఐతే ఆ ఒక్క సినిమాకు పరిమితమైతే బాగుండదని.. తర్వాతి రోజుల్లో మొత్తం ఇండస్ట్రీనే టార్గెట్ చేశారు. అందరూ తన కాళ్లదగ్గరకు వచ్చేలా చేశారు. ఈ రోజుల్లో 5, 10 రూపాయలు పెట్టి టికెట్లు అమ్మితే థియేటర్ల మనుగడ ఎలా సాధ్యం? ఫిలిం ఇండస్ట్రీ ఎలా బతుకుతుంది? అలాంటి చర్యలను ఈ రోజు రేట్ల పెంపుతో పోల్చి కొనియాడడం కచ్చితంగా తప్పే.