Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీలు కోదండరాం, అలీ ఖాన్ ల పోస్టులు ఊస్ట్

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, అలీ ఖాన్‌ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ బుధవారం కీలక తీర్పు వెలువరించింది.

By:  A.N.Kumar   |   13 Aug 2025 8:12 PM IST
ఎమ్మెల్సీలు కోదండరాం, అలీ ఖాన్ ల పోస్టులు ఊస్ట్
X

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, అలీ ఖాన్‌ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ నియామకాలను సవాల్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, నియామకాలు చట్టపరంగా సరైనవికాదని వ్యాఖ్యానించింది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి, గవర్నర్ కోటాలో నియామకాలకు కోదండరాం, అలీ ఖాన్ పేర్లు సూచించారు. గవర్నర్ ఎటువంటి అభ్యంతరం లేకుండా వీరిని శాసనమండలికి పంపారు. అయితే ఈ ఎంపికలను అప్పట్లోనే బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. గవర్నర్, బీఆర్‌ఎస్ ప్రతిపాదించిన శ్రవణ్, సత్యనారాయణ పేర్లను తిరస్కరించడం, తరువాత కాంగ్రెస్ ప్రతిపాదితులను ఆమోదించడం పట్ల ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

-సుప్రీంకోర్టు తీర్పు

దీర్ఘకాలంగా హోల్డ్‌లో ఉన్న ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత, కోదండరాం, అలీ ఖాన్ నియామకాలను రద్దు చేసింది. అలాగే ఖాళీ అయిన ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసినా, అవి తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.

రాజకీయ ప్రభావం

ఈ తీర్పు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన కోదండరాం, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సహకరించిన నేతగా గుర్తింపు పొందారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన కృతజ్ఞతను తెలిపింది. కానీ, బీఆర్‌ఎస్ మొదటి నుంచి ఈ నియామకంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పుతో, ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల భవిష్యత్తు సెప్టెంబర్ 17న వెలువడే తుది తీర్పుపైనే ఆధారపడి ఉంది. అప్పటివరకు ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది.

మొత్తం మీద ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గవర్నర్ కోటా నియామకాలపై చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ తన తదుపరి వ్యూహం ఏంటో, బీఆర్‌ఎస్ ఈ పరిణామాన్ని ఎలా ప్రయోజనపరచుకుంటుందో అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.