Begin typing your search above and press return to search.

ఆనం వారు రాగం తీశారు. అది కొండంత అవుతుందా ?

ఆయన కాంగ్రెస్ టీడీపీ వైసీపీ మళ్ళీ టీడీపీ ఇలా పార్టీలు మారారు. మరి ఇదే క్రమంలో మరో సారి చేసినా ఏమీ విడ్డూరం లేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 July 2025 10:40 PM IST
ఆనం వారు రాగం తీశారు. అది కొండంత అవుతుందా  ?
X

తెలుగుదేశం పార్టీ అంటేనే నిండా సీనియర్లతో నిండి ఉన్న పార్టీ. 1982లో పాతికేళ్ల ప్రాయంలో ఉంటూ పార్టీలో చేరిన వారు ఇపుడు ఏడు పదులకు చేరువ అవుతున్నారు. దాంతో 2024 ఎన్నికల నుంచే సీనియర్లను పక్కన పెట్టే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక 2029లో చూస్తే పూర్తిగా 50 ఏళ్ళ లోపు వారికే చాన్స్ అన్న చర్చ కూడా ఉంది. దాంతో పార్టీలో సీనియర్లలో అంతర్మధనం మొదలైంది.

అయితే వారు ఎవరూ ఇపుడిపుడే బయటపడడం లేదు. కానీ వారికి ఒక సీనియర్ బాటలు వేశారా అన్న చర్చ అయితే సాగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తాజాగా సాటి మంత్రి మీదనే పరోక్ష విమర్శలు చేసిన వైనం అయితే టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా మంత్రి నారా లోకేష్ వేదిక పైన ఉండగానే చేయడంతో అసలు ఏమి జరిగి ఉంటుంది అన్నదే చర్చగా మారింది.

ఆనం రామనారాయణరెడ్డి ఆధిపత్యం కోసమే ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారు అని అంటున్నారు. ఇక ఆయనకు దేవాదాయ శాఖను ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఆర్ధిక శాఖ వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖను చూశారు. అలాంటిది ఆయనకు ఇపుడు తనకు తన అనుభవానికి తగిన శాఖ దక్కలేదన్న అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

మరో వైపు జిల్లాలో నారాయణ హవా సాగడం కూడా నచ్చడంలేదు అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆనం వారు ఇలా సౌండ్ చేశారు అని అంటున్నారు. అంతే కాదు సీనియర్లుగా ఉంటూ మంత్రులుగా ఉన్న వారు కొందరు కూడా మధనం చెందుతున్నారు. ఇక ఆనం విషయానికి వస్తే ఈ ధిక్కరణ వల్ల పోయేది ఏమీ ఉండదనే భావించి ఇలా చేసారా అని అంటున్నారు.

విస్తరణలో అయినా లేక ఈ అయిదేళ్ళ తరువాత అయినా పదవి ఉండదని టికెట్ కూడా ఈసారి దక్కదని భావించే ఆయన కొంత తెగువ చూపించారు అని అంటున్నారు. ఇక ఆయన పార్టీ సైతం మారాలనుకుంటున్నారా అంటే ఏమో ఏమైనా జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ టీడీపీ వైసీపీ మళ్ళీ టీడీపీ ఇలా పార్టీలు మారారు. మరి ఇదే క్రమంలో మరో సారి చేసినా ఏమీ విడ్డూరం లేదని అంటున్నారు.

ఇక చాలా మంది సీనియర్లు కూడా తమకు పదవులు దక్కలేదని దక్కినా తగిన ప్రాధాన్యత లేదని తెగ ఫీల్ అవుతున్నారు వారు కూడా నేడు కాకపోయినా రేపు అయినా పెదవి విప్పుతారా అన్న చర్చ సాగుతోంది. తమకు కాకపోయినా తమ వారసులకు టికెట్ వచ్చే ఎన్నికల్లో దక్కుతుంది అనుకున్న వారు అయితే కొంత తగ్గుతారు కానీ ఏమీ లేదు అని తెలిస్తే మాత్రం ఇలాగే ఏదో ఒక వేదికను ఎంచుకుని గొంతు సవరించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం ఇలాంటి విషయాలని సీరియస్ గానే గమనిస్తూ లైట్ గా తీసుకుంటోంది అని అంటున్నారు. సీనియర్లు అయితే ఇలాగే ఉంటుందని అందుకే జూనియర్లను ముందుకు తేవాలన్న విధానమే కరెక్ట్ అని భావిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి ఆనం వారు రాగం తీశారు. అది కొండంత అవుతుందా లేదా సన్నగా అలాగే ఉండిపోతుందా అంటే కాలమే చెప్పాలని అంటున్నారు.