తిన్నింటివాసాలు లెక్క.. బాబు స్ట్రాంగ్ ట్రీట్‌మెంట్
టీడీపీ అనుబంధ విభాగం తెలుగు మహిళకు స్టేట్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సందిరెడ్డి గాయత్రి.. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.
By: Tupaki Desk | 30 April 2025 3:30 AM ISTఒక పార్టీలో ఉంటూ.. మరోపార్టీకి మేలు చేసేలా వ్యాఖ్యలు చేయడం.. ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించడం.. కొందరు నాయకులకు అలవాటుగా మారింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీల్లోనూ ఈ తరహా నాయకులు పెరుగుతున్నారు. వీరిపై ఆయా పార్టీలకు ఫిర్యాదులు అందుతున్నా.. కారణాలు తెలియవు కానీ.. చర్యలు మాత్రం ఎవరూ ఎవరిపైనా తీసుకోవడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని టీడీపీ నాయకులు ఒకరిద్దరు నోరు చేసుకుంటున్నారు.
వాస్తవానికి పది మాసాల కాలంలో పలు కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. వీటిపై ప్రచారం చేసుకుని.. విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు అడ్డుకట్ట వేయాల్సిన నాయకులు.. తామే.. ప్రతిపక్షాల పాత్ర పోషిం చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాను ఆలంబనగా చేసుకుని చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించిన టీడీపీ నాయకురాలికి చంద్రబాబు గట్టి షాకే ఇచ్చారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.
టీడీపీ అనుబంధ విభాగం తెలుగు మహిళకు స్టేట్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సందిరెడ్డి గాయత్రి.. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. సబ్ స్క్రైబర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. అయితే.. ఆమె సర్కారుకు అనుకూలంగా కాకుండా.. వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం.. చిన్న చిన్న కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేయడం అలవాటు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ ఇప్పటికి రెండు సార్లు ఆమెను హెచ్చరించింది. అయినా.. ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న నాయకులకు చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరి మున్ముందు.. ఇలాంటి రెండు పడవలపై కాళ్లు పెట్టేనాయకులు మేల్కొంటారో లేదో చూడాలి.