గవర్నర్ వద్దు...ఎవరికి ఈ అవమానం ?
గవర్నర్ అన్నది రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైనది.
By: Satya P | 14 Aug 2025 9:02 AM ISTగవర్నర్ అన్నది రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైనది. నడించే రాజ్యాంగం అని కూడా చెబుతారు. ఒక రాష్ట్రానికి గవర్నర్ అంటే తొలి పౌరుడు కింద లెక్క. అయితే ఆయనకే అవమానం జరిగింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి ఏ రాజ్యాంగపాల్ కి జరగని విధంగా ఈ అవమానం జరిగింది. ఆయన తమిళనాడులోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీలు ప్రదానం చేయడం ఒక ఆచారం. మొదటి నుంచి వసతున్న సంప్రదాయం.
ఆయన చేతుల మీదగా నో :
ఇదిలా ఉంటే ఒక విద్యార్ధిని అనూహ్యంగా గవర్నర్ ఆర్ఎన్ రవి చేతుల మీదుగా పట్టా తీసుకునేందుకు నిరాకరించడం ఇపుడు పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఆమె గవర్నర్ పక్కన నిలబడి ఉన్న ఉప కులపతి నుంచి ఈ పట్టాను తీసుకున్నారు. ఇక ఆమె గవర్నర్‌ను దాటుకుని వెళ్లి వీసీ నుంచి డిగ్రీ స్వీకరించడం విశేషం. ఇక గవర్నర్ తమిళ ప్రయోజనాలకు వ్యతిరేకి అని ఆమె ఆరోపించారు. అయితే ఈ విధంగా గవర్నర్ కి నిరసన తెలిపిన విద్యార్థిని డీఎంకే నేత భార్యగా చెబుతున్నారు.
ఆమె చర్యతో ఆశ్చర్యం :
ఇదిలా ఉంటే తమిళనాడులోని తిరునల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి 650 మందికి పైగా విద్యార్థులు హాజరైతే ఆ విద్యార్ధిని మాత్రమే గవర్నర్ ని వ్యతిరేకినడం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. గవర్నర్ ని పక్కన పెట్టి ఆమె చేసిన ఈ పనికి వేదికపై ఉన్న అధికారులు, సభలో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఇదంతా జాగ్రత్తగానే గమనించిన తమిళనాడు గవర్నర్ రవి పూర్తిగా మౌనం పాటించారు.
నాకు ఇష్టం లేదంతే :
ఇక తాను పట్టాను అందుకున్న తరువాత సదరు విద్యార్ధిని జీన్ జోసెఫ్ తన చర్యను చాలా గట్టిగానే సమర్థించుకున్నారు. గవర్నర్ రవి తమిళనాడుకు రాష్ట్ర తమిళ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ కారణంగానే తాను ఆయన చేతుల మీదుగా పట్టాను అందుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇలా ఆమె ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
రాజకీయాలకు వేదికగా :
విశ్వవిద్యాలయాలు అన్నింటికీ అతీతమైనవి. కానీ రాజకీయాలకు వాటిని వేదికగా మార్చుకోవడం ఏ మేరకు సబబు అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక జీన్ జోసెఫ్డీ ఎంకే పార్టీకి చెందిన నాగర్‌కోయిల్ టౌన్ యూనిట్ డిప్యూటీ సెక్రటరీ రాజన్ భార్య అని చెబుతున్నారు. మరో వైపు చూస్తే తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్‌కు అనేక విషయాల మీద వివాదాలు జరుగుతూ వస్తున్నాయి. అవి ఏకంగా సుప్రీం కోర్టు దాకా వెళ్ళాయి. అయితే ప్రభుత్వాలు రాజకీయాలు విధానపరమైన అంశాలు వేరు, విశ్వవిద్యాలయాలలో ఈ తరహా ఘటనలు వేరు అని అంటున్నారు.
భిన్న వాదనలు :
ఇక పరిశోధనా విద్యార్ధిని జీన్ జోసెఫ్డీ చేసిన పని పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఆమె ధైర్యాన్ని కొందరు కొనియాడుతూంటే స్నాతకోత్సవం లాంటి వేదికను రాజకీయ నిరసనలకు వాడుకోవడం సరికాదని మరికొందరు దుయ్యబెడుతున్నారు. ఏది ఏమైనా ఇలా కూడా నిరసనలు తెలియచేయవచ్చు అని నిరూపించిన జీన్ జోసెఫ్డీ సరికొత్త రాజకీయ పరిశోధన ఇలా చేశారు అని సెటైర్లు వినిపిస్తున్నాయి.