ఆపరేషన్ సింధూర్ లో పాల్గొంటే కేసుల నుంచి విముక్తి లేదు
అయితే తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరుతో అతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
By: Tupaki Desk | 24 Jun 2025 9:01 PM ISTఓ కేసులో నిందితుడిగా ఉన్న ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోకి సుప్రీంకోర్టు తీవ్ర చురకలు పేల్చింది. దేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో తాను పాల్గొన్నానని, అందుకు గాను తనపై ఉన్న హత్య కేసులో మినహాయింపు ఇవ్వాలని కోరగా, కోర్టు తేల్చి చెప్పింది. ఆపరేషన్‌లో పాల్గొన్నంత మాత్రాన నేరం నుండి విముక్తి ఇవ్వలేమని స్పష్టంచేసింది.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ క్యాట్ కమాండోగా పనిచేస్తున్నాడు. అతనిపై భార్యను వరకట్నం కోసం హత్య చేశాడని 2004లో కేసు నమోదైంది. ట్రయల్ కోర్టు విచారణ జరిపి అతనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికీ అక్కడ కూడా అదే తీర్పు వచ్చింది.
అయితే తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరుతో అతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ ఆపరేషన్‌లో తాను కీలక పాత్ర పోషించానని, అందువల్ల తనపై నమోదైన హత్య కేసు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరాడు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. "దేశ సేవ నోబెల్ డ్యూటీ అయినప్పటికీ, నేరానికి ఇది రక్షణ కాదు. ఇది అత్యంత దారుణమైన ఘటన. మీపై నమోదైన కేసులో మీరు ఎదుర్కొనాల్సిందే" అని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో దేశ సేవలో ఉన్నవారు కూడా వ్యక్తిగతంగా చేసే తప్పులకి శిక్ష తప్పదని, న్యాయ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుందని కోర్టు మరోసారి తేల్చిచెప్పినట్టు అయ్యింది.