78 వేల ఏళ్లయినా కశ్మీర్ లో మి.మీ. కూడా కదల్చలేరు.. గావస్కర్ గరంగరం
వేదిక ఏదైనా.. ప్రదేశం ఎక్కడైనా సరే.. భారత దేశ ప్రయోజనాల గురించి గొంతు ఎత్తే సునీల్ గావస్కర్ పహల్గాం ఘటనపైనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 25 April 2025 5:00 PM ISTక్రికెట్ కెరీర్ లో ఎందరో పాకిస్థానీ బౌలర్లను చీల్చి చెండాడిన దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్.. పహల్గాం ఘటన మీద ఉగ్రవాదులను చెడుగుడు ఆడారు.
పహల్గాం.. పహల్గాం.. పహల్గాం.. నాలుగు రోజుల నుంచి ఒకటే చర్చ.. వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కశ్మీర్ లోని ఈ ప్రాంతానికి వెళ్లిన పర్యటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ మారణకాండతో భారత దేశం రగిలిపోతోంది..
ఏకంగా 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడంతో దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.. దీనికి ప్రతీకారం ఎప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ మ్యాచ్ లకు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న భారత దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించారు.
వేదిక ఏదైనా.. ప్రదేశం ఎక్కడైనా సరే.. భారత దేశ ప్రయోజనాల గురించి గొంతు ఎత్తే సునీల్ గావస్కర్ పహల్గాం ఘటనపైనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం బెంగళూరు చిన్నస్వామి మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం కామెంటేటర్ గా ఉన్న గావస్కర్ స్పందించారు.
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్ల నుంచి ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇస్తున్నవారు అంగుళం కూడా కదలించలేకపోయారని గావస్కర్ అన్నారు. ముందుముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పరోక్షంగా పాకిస్థాన్ కు చురకలు వేశారు.
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి గావస్కర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీయులను కలచి వేసిన ఈ ఘటన నేపథ్యంలో.. ఉగ్రవాదులు, వారికి మద్దతుగా నిలిచేవారికి గావస్కర్ ఒక ప్రశ్న వేశారు. ఏం సాధించడానికి ఇదంతా? 78 ఏళ్లలో మిల్లీ మీటర్ భూమినైనా కదల్చలేని మీరు.. మరో 78 వేల సంవత్సరాల తర్వాతైనా ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.