Begin typing your search above and press return to search.

సీమ నుంచి టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ?

ఆయనే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగా నిలిచి టీడీపీ నుంచి పోటీ చేశారు. అంతకు ముందు ఆయన ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 1:21 PM IST
సీమ నుంచి టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ?
X

రాయలసీమ వైసీపీకి కంచు కోట. 2024 లో మాత్రం అది రివర్స్ అయింది. అయినా అభిమానం అలాగే ఉందని అంటున్నారు. జగన్ కి ఒక్క సారి ఝలక్ ఇవ్వాలనే 2024లో సొంత సామాజిక వర్గంతో పాటు ఆయన్ని అభిమానించే వారు వైసీపీ క్యాడర్ అంతా కాడె వదిలేయడంతోనే దారుణమైన ఫలితాలు వైసీపీ చవి చూసింది అని అంటున్నారు.

అయితే ఈసారి అలా జరగదని సీమ మళ్ళీ వైసీపీ వైపుగా పొలిటికల్ టర్నింగ్ ఇచ్చుకుంటోందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ కూడా మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. సీమలో వైసీపీ తిరిగి లేవకుండా ఉండేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోంది. కడపలో టీడీపీ మహానాడుని నిర్వహించడం వెనక ఉద్దేశం కూడా అదే.

అయితే మహానాడులో సీమ నుంచి వైసీపీ కీలక నేతలను టీడీపీలోకి రప్పించాలని ఆ పార్టీ చూసినా ఎందుకో వీలుపడలేదని చెబుతారు. అయితే అనూహ్యంగా మహానాడు ముగిసిన మరుసటి రోజే సీమలో కీలకమైన కడప జిల్లా రాజంపేట నుంచి ఒక సీనియర్ టీడీపీ నేత పార్టీకి రాజీనామా ప్రకటించి షాక్ ఇచ్చారు.

ఆయనే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగా నిలిచి టీడీపీ నుంచి పోటీ చేశారు. అంతకు ముందు ఆయన ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఇక సుగవాసి కుటుంబానికి టీడీపీకి మధ్య ఉన్నది దశాబ్దాల అనుబంధం. ఆయన తండ్రి పాలకొండరాయుడు ఇటీవలనే మరణించారు. ఆయన 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు. చంద్రబాబు వైఎస్సార్ సమకాలీనుడు. అంతే కాదు పలు మార్లు ఎమ్మెల్యేగా రాజంపేట నుంచి ఎంపీగా కూడా గెలిచిన వారు.

సుగవాసి కుటుంబం రాజంపేటలో బలమైన రాజకీయ కుటుంబం. అంతే కాదు బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన ఫ్యామిలీ. దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకున్న ఆ కుటుంబం నుంచి పాలకొండ రాయుడు రాజకీయ వారసుడు అయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీకి దూరం కావడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

అయితే ఆయన టీడీపీలో ఉంటే తనకు భవిష్యత్తు ఉండదని భావించే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో రాజంపేట నుంచి వైసీపీ తరఫున ఎంపీ టికెట్ ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న వైసీపీ సీనియర్ నేత మిధున్ రెడ్డి పీలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు అని చెబుతున్నారు. అలా రాజకీయంగా ఒప్పందం కుదరడంతోనే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఫ్యాన్ నీడకు చేరుకుంటున్నారు అని తెలుస్తోంది. అన్నీ కుదిరితే రేపో మాపో ఆయన వైసీపీలోకి చేరడం ఖాయమని అంటున్నారు.

ఎన్నికల ముందు నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా వైసీపీ నుంచే ఇతర పార్టీలలోకి నేతలు వెళ్ళిపోతున్నారు ఆ విధంగా వలసలతో కాస్తా నీరసించి ఉన్న వైసీపీకి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాక బలాన్ని ఇస్తుందని అంటున్నారు. తొలి ఏడాది పూర్తి చేసుకున్న కూటమికి ప్రజాదరణ తమ వైపే ఉందని చెబుతూ ఇక మీదట తమ పార్టీలోకి నేతలను ఆహ్వానించడానికి వైసీపీ సిద్ధం అవుతోంది. అందులో శుభారంభంగా వైసీపీకి కలసి వచ్చిన కడప జిల్లా నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంని చేర్చుకోవడం ద్వారా పొలిటికల్ గా ప్రకంపనలు రేపాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.