అంతరిక్షంలోకి వెళ్లాల్సిన అస్తికలు.. సముద్రగర్భంలోకి..
జర్మనీకి చెందిన స్టార్టప్ సంస్థ 'ది ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ' అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సెలెస్టిస్ అనే స్పేస్ బరియల్ కంపెనీతో కలిసి ఈ 'మిషన్ ఇంపాజిబుల్'ను ప్రారంభించింది.
By: Tupaki Desk | 8 July 2025 1:00 PM ISTఅంతరిక్షాన్ని మానవ స్మృతులకు స్వర్గధామంగా మార్చాలనే గొప్ప ఆశయంతో చేపట్టిన ఒక వినూత్న అంతరిక్ష ప్రయోగం విషాదకరంగా ముగిసింది. ప్రేమతో, గౌరవంతో తమ ప్రియమైనవారి జ్ఞాపకాలను చిరంజీవిగా ఉంచాలని కోరుకున్న 166 మంది మృతుల అస్థికలను అంతరిక్షంలోకి పంపిన 'మిషన్ ఇంపాజిబుల్' ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. చివరి క్షణాల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా స్పేస్ క్యాప్సుల్ భూమికి తిరిగి చేరకముందే పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
వినూత్న ప్రయత్నం... కానీ విషాదాంతం
జర్మనీకి చెందిన స్టార్టప్ సంస్థ 'ది ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ' అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సెలెస్టిస్ అనే స్పేస్ బరియల్ కంపెనీతో కలిసి ఈ 'మిషన్ ఇంపాజిబుల్'ను ప్రారంభించింది. జూన్ 23న ఎన్‌వైఎక్స్ (Nyx) పేరుతో అభివృద్ధి చేసిన స్పేస్ క్యాప్సుల్‌ను భూమి గుండా ప్రయోగించారు. ఈ క్యాప్సుల్‌లో 166 మంది మృతుల అస్థికలు, డీఎన్‌ఏ నమూనాలు, విత్తనాలు, ఇతర స్మృతిచిహ్నాలను ఉంచారు. భూమిని పలుమార్లు చుట్టి తిరిగి భూ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించి, సురక్షితంగా వెనక్కి వచ్చేలా ఈ స్పేస్ క్యాప్సుల్‌ను డిజైన్ చేశారు.
రెండుసార్లు విజయవంతం... మూడోసారి వైఫల్యం
ఈ ప్రయోగం మొదటి దశ అద్భుతంగా సాగింది. క్యాప్సుల్ భూమిని రెండు సార్లు విజయవంతంగా చుట్టి వచ్చింది. అయితే, మూడవ సారి భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఊహించని సమస్య తలెత్తింది. మిషన్ కంట్రోల్ కేంద్రంతో స్పేస్ క్యాప్సుల్ సంబంధాలను కోల్పోయింది. తక్కువ సమయంలోనే క్యాప్సుల్ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్లు కంపెనీ ప్రకటించింది.
- కంపెనీ స్పందన
ఈ దురదృష్టకర ఘటనపై 'ది ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ' స్పందించింది. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని, క్షమాపణలను తెలియజేసింది. "మా ప్రయోగం వినూత్న లక్ష్యాలతో ముందుకు సాగింది. ప్రారంభ దశలో విజయవంతమైంది. అయితే చివర్లో తలెత్తిన సమస్య వల్ల పూర్తి విజయాన్ని సాధించలేకపోయాం. ఈ ప్రమాదంతో మొత్తం అస్థికలు సముద్రంలో కలిసిపోయాయి. వాటిని తిరిగి పొందడం అసాధ్యం. అయినా ఈ చారిత్రక ప్రయోగంలో భాగమయ్యారన్న గౌరవం బాధిత కుటుంబాలకు ఎప్పుడూ ఉంటుంది" అని పేర్కొంది.
భవిష్యత్ ప్రయోగాలకు బలమైన పాఠం
ఈ వైఫల్యం భవిష్యత్తులో అంతరిక్ష శవ దహనాలు చేపట్టే సంస్థలకు ఒక బలమైన పాఠంగా నిలవనుంది. మానవ జ్ఞాపకాలను అంతరిక్షం వరకు తీసుకెళ్లే ఈ కొత్త విభాగం విజయవంతం కావాలంటే మరింత శాస్త్రీయత, పటిష్టమైన జాగ్రత్తలు అవసరమని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
సాంకేతిక విజ్ఞానం ఎంత పురోగమించినా... మానవ భావోద్వేగాలను సురక్షితంగా మోసుకెళ్లడం మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద సవాలే!