రాజకీయాలకు ‘గంగూలీ’ భయపడుతున్నాడా?
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి రాజకీయాలపై తన స్థానం స్పష్టంగా తెలియజేశారు.
By: Tupaki Desk | 23 Jun 2025 12:00 AM ISTభారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి రాజకీయాలపై తన స్థానం స్పష్టంగా తెలియజేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో 2026 ఎన్నికల వేళ గంగూలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారన్న వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ, "నాకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. ఇవన్నీ కేవలం రూమర్లే. రాజకీయాలు అనుకోవడం అంత ఈజీ కాదు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే రాజకీయాలే మార్గం కాదు" అని తెలిపారు.
అంతేకాకుండా ఏ పార్టీ తరఫున ప్రచారం చేయడం కూడా తాను చేయబోనని స్పష్టం చేశారు. "ఇన్నేళ్లుగా క్రికెట్ ఆడాను, క్రికెట్ పరిపాలనా బాధ్యతలు చూసాను. నాకు తెలిసినది క్రీడల గురించి. రాజకీయాల దిశగా వెళ్లాలనుకునే ఉద్దేశం నాకు లేదు" అని గంగూలీ తేల్చిచెప్పారు.
గంగూలీ రాజకీయాల్లోకి వస్తున్నారని గతంలోనూ పలు ప్రచారాలు జరిగినప్పటికీ ప్రతీసారీ ఆయన వాటిని ఖండించారు. 2026లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ రూమర్లు మరింత ఊపందుకున్నాయి. అయితే ఈసారి గంగూలీ స్వయంగా క్లారిటీ ఇవ్వడం రాజకీయ గాసిప్స్‌కు ముగింపు పలకించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాక, ప్రస్తుతం తాను వివిధ కమర్షియల్ బ్రాండ్ల ప్రచారం, క్రీడల పరిపాలన రంగాల్లో తన సేవలు కొనసాగిస్తున్నానని కూడా గంగూలీ పేర్కొన్నారు.