ఉగ్రవాద ముప్పుపై భారత్ తో రష్యా కీలక వ్యాఖ్యలు!
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 April 2025 7:00 PM ISTజమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. పలు ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ సమయంలో రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో కీలక విషయాలు వెల్లడించారు.
అవును... భారత రాయబారి వినయ్ కుమార్ తో సమావేశమైన రష్యా మంత్రి ఆండ్రీ రుడెంకో.. ప్రపంచ ఉగ్రవాద ముప్పును కలిసి ఎదుర్కోవడానికి సంసిద్ధతను పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ... భారతదేశంలో కలిసి ప్రపంచ ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి రష్యా సంసిద్ధత పునరుద్ఘాటించబడిందని 'ఎక్స్' లో వెల్లడించింది.
ఈ సందర్భంగా పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో సహా దక్షిణాసియా ప్రాంతంలోని సాధారణ పరిస్థితి, రాబోయే రాజకీయ పరిచయాల షెడ్యూల్ పై అధికారులు చర్చించారని అధికారిక ప్రకటన తెలిపింది.
కాగా... ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక నేపాలీ జాతీయుడు సహా 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడి వెనుక పాక్ హస్తం ఉందని బలంగా నమ్ముతున్న భారత్.. ఈ చర్యను తీవ్రంగా పరిగణించింది.
రష్యా యుద్ధ విరమణ!:
ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం అవిరామంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మూడు రోజులపాటు ఉక్రెయిన్ పై పోరు విరమణను పాటించనున్నట్లు రష్యా ప్రకటించింది. ఇందులో భాగంగా... రెండో ప్రపంచయుద్ధ విజయానికి 80వ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు ఉక్రెయిన్ పై పోరు విరమణను ప్రకటించనున్నట్లు రష్యా ప్రకటించింది.
ఈ సందర్భంగా... మానవతా దృక్పథంతో పూర్తిస్థాయిలో ఆ మూడురోజులు పోరును విరమించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు రష్యా వెల్లడించింది.