Begin typing your search above and press return to search.

ఆర్జీవీకి లంచం రూ.రెండు కోట్లా?!

ఫోటోలు మార్ఫింగు ఎవరు చేయమన్నారు అన్న ప్రశ్నతో ఆర్జీవీ విచారణ ప్రారంభించగా, వ్యూహం సినిమా ప్రదర్శనకు తీసుకున్న డబ్బు చుట్టూనే ఎక్కువ ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   13 Aug 2025 7:55 PM IST
ఆర్జీవీకి లంచం రూ.రెండు కోట్లా?!
X

ఏపీలో గత ప్రభుత్వం నుంచి సినీ దర్శకుడు రామగోపాలవర్మ రూ.రెండు కోట్లు తీసుకున్నారన్న విషయంపై మరో మారు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2024లో వ్యూహం సినిమాకు దర్శకత్వం వహించిన ఆర్జీవీ, ఆ సినిమా ప్రమోషన్ల భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై మంగళవారం ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ లో ఆర్జీవీ సుమారు 12 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు. అయితే సందర్భంగా పోలీసులు దాదాపు 50 ప్రశ్నలు వేస్తే, అందులో ప్రభుత్వం నుంచి రూ.2 కోట్లు అందుకోవడంపైనే ఎక్కువ ప్రశ్నలు వేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఫోటోలు మార్ఫింగు ఎవరు చేయమన్నారు అన్న ప్రశ్నతో ఆర్జీవీ విచారణ ప్రారంభించగా, వ్యూహం సినిమా ప్రదర్శనకు తీసుకున్న డబ్బు చుట్టూనే ఎక్కువ ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారు. అదేవిధంగా వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడంపైనా ప్రశ్నలు అడిగినట్లు చెబుతున్నారు. అయితే సినిమా నిర్మాణానికి ముందే కిరణ్ కుమార్ కు టీటీడీ సభ్యత్వం ఇచ్చారని వర్మ చెప్పినట్లు కథనాలు ప్రచారం అవుతున్నాయి.

కాగా, వ్యూహం సినిమాను ఏపీ ఫైబర్ నెట్ లో ప్రదర్శించేందుకు గత ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యూస్ ప్రకారం డబ్బు చెల్లించాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే పెద్దగా వ్యూస్ రాకపోయినా రూ.1.15 కోట్లు చెల్లించారని గతంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మనుగా ఉన్న జీవీ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న డబ్బు 15 రోజుల్లోగా చెల్లించాలని అప్పట్లో నోటీసు జారీ చేశారు. అయితే జీవీ రెడ్డి ఆ పదవి నుంచి వైదొలగిన తర్వాత ఈ అంశం అటకెక్కిందని భావించారు.

కానీ, ఫొటోల మార్ఫింగ్ కేసులో వర్మను విచారణకు పిలిచిన పోలీసులు.. ఫైబర్ నెట్ చెల్లించిన డబ్బుపైనా ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. వాస్తవానికి సినిమాకు సంబంధించి నగదు లావాదేవీలు నిర్మాత పరిధిలో ఉంటాయి, ఆ విషయాన్ని వదిలేసి వర్మకు డబ్బుకు ముడిపెట్టడంపై కూడా చర్చ జరుగుతోంది. వ్యూహం సినిమా దర్శకుడైన వర్మకు ఫైబర్ నెట్ ప్రసారాలకు సంబంధం ఏంటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆయనను బాధ్యుడిని చేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఒంగోలు రూరల్ పోలీసులకు ఫైబర్ నెట్ చెల్లింపులకు సంబంధం లేదని వర్మ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. మొత్తానికి ఏదిఏమైనా విచారణ నిమిత్తం వర్మ పోలీసుల ఎదుటకు రావడం, రెండు కోట్ల నిధులపై సోషల్ మీడియాకు మంచి మేత లభించినట్లైందని అంటున్నారు.