ఒకే ఫ్రేమ్ లో చంద్రబాబు రేవంత్ రెడ్డి...వేదిక అదే !
ఇదిలా ఉంటే ఈ పెళ్ళికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. దాంతో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరూ ఈ పెళ్ళిలో కలుసుకునే అవకాశాలు ఉన్నాయి
By: Tupaki Desk | 29 April 2025 8:59 PM ISTరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట కలవనున్నారా అయితే సందర్భం ఏమిటి, సమయం ఏమిటి వేదిక ఎక్కడ ఇత్యాది ప్రశ్నలు వెంటనే పుట్టుకుని వస్తాయి. వాటికి జవాబులూ రెడీగా ఉన్నాయి. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం విజయవాడలో కలవనున్నారు.
ఈ ఇద్దరినీ కలుపుతోంది తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. ఆయన కుమారుడి వివాహం విజయవాడలో జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి అతిరధ మహారధులు అంతా హాజరు అవుతున్నారు. ఇక తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఉమా ఆహ్వానించారు.
రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నపుడు ఉమాకు మంచి పరిచయాలు ఉండేవి. ఆ చనువుతో ఆయన రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని కలసి మరీ ఆహ్వాన పత్రాలను దేవినేని ఉమా అందించారు. తాను తప్పకుండా వస్తాను అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మాట ప్రకారం బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి విజయవాడ చేరుకుంటారు. పెళ్ళికి ఆయన హాజరై సుమారుగా నలభై నిముషాల వరకూ గడుపుతారు. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ఇదిలా ఉంటే ఈ పెళ్ళికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. దాంతో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరూ ఈ పెళ్ళిలో కలుసుకునే అవకాశాలు ఉన్నాయి అంతే కాదు బాబు సీఎం అయ్యాక తొలిసారి హైదరాబాద్ లో కలుసుకున్న ఇద్దరు సీఎంలకు ఇది రెండవ వేదిక అవుతుంది.
ఇక ఈ పెళ్ళికి టీడీపీకి చెందిన కీలక నేతలు అంతా హాజరవుతున్నారు దాంతో రేవంత్ రెడ్డి తన పాత స్నేహితులను అందరినీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికి పదేళ్ళ క్రితం అమరావతి రాజధాని శంకుస్థాపన కి వచ్చిన నాటి తెలంగాణా సీఎం కేసీఅర్ తో నాటి టీడీపీ నేతలు ఎంతో సాన్నిహిత్యం కనబరచి ముచ్చట్లు పెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
కేసీఆర్ కూడా సుదీర్ఘ కాలం టీడీపీలో ఉన్న వారే కావడం విశేషం. ఇక ఇపుడు రేవంత్ రెడ్డి తో కూడా చాలా మంది టీడీపీ నేతలు ముచ్చట్లు పెట్టే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉంటూ అగ్ర నేతగా ఎదిగారు. ఆయనకు ఈ రోజుకీ అనేక మంది నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు.
మొత్తం మీద చూస్తే తెలంగాణాకు సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి ఏపీకి ఈ విధంగా రావడంతో పాత మిత్రులను కలుసుకునే సందర్భంగా ఇది మారనుందా అన్న చర్చ అయితే వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి విజయవాడ రాక మాత్రం చాలా ఆసక్తిని రేపే అంశం అవుతుంది అని అంటున్నారు.